పల్లెల రూపురేఖల్ని మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమం పల్లెప్రగతి. నిర్ణీత రోజుల్లో పారిశుద్ధ్యం, పాత భవనాల కూల్చివేత, విద్యుత్ సమస్యల పరిష్కారం, డంపింగ్ యార్డు,శ్మశాన వాటికల నిర్మాణం.. ఇలా పల్లె ప్రగతికి దోహదపడే పనులు చేపట్టడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ పనులు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. జిల్లా పాలనాధికారి వెంకట్రావు ఆదేశాల మేరకు పల్లె ప్రగతి మొబైల్ యాప్‌ను రూపొందించింది.
షెడ్యూల్‌పై అప్పటికప్పుడే సమాచారం
ఈ యాప్... జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అందుబాటులో ఉంటుంది. వారు చేయాల్సిందల్లా ప్రతి బుధవారం కలెక్టర్ నిర్దేశించిన గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న ప్రగతిని సమీక్షించాలి. బుధవారం ఉదయమే ఏ గ్రామానికి వెళ్లాలో కలెక్టర్ నుంచి సందేశం వస్తుంది. అప్పటి వరకూ ఎక్కడికి వెళ్లాలో ఎవరికి తెలియదు. సందేశం వచ్చాక ఉదయం 9 గంటల్లోపు గ్రామానికి చేరుకోవాలి. ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో మాట్లాడాలి. ఏమైనా సమస్యలుంటే యాప్‌లో ఫోటో తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.
యాప్‌లో ప్రతి దానికి ప్రూఫ్ ఉంటుంది..
పల్లెల్లో జరిగే మూడు బృందాల పర్యటనలు తూతూ మంత్రంగా జరగకుండా ఈ యాప్‌ను రూపొందించారు. బృందం గ్రామానికి చేరుకోగానే ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఆ ఫోటో ఏ లొకేషన్ నుంచి వచ్చిందో యాప్ నమోదు చేస్తుంది. ప్రతి సమస్యకూ ఫోటోను తప్పక జత చేయాలి. ఇక తనిఖీ చేయాల్సిన అన్ని ప్రభుత్వ సంస్థలనూ యాప్‌లో పొందుపరిచి వాటి పరిస్థితి ఏమిటో చెప్పేలా ప్రశ్నలు రూపొందించారు. ఈ సమస్యలన్నీ ఆయా శాఖల ఉన్నతాధికారుల దృష్టికీ వెళ్తాయి.
యాప్ విధానం బాగుబాగు..
పల్లెప్రగతి యాప్‌పై అధికారులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియడంతో పాటు అధికారులు గ్రామాల్లో ఎప్పుడు తనిఖీలు నిర్వహిస్తారోనని కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. అధికారులు నేరుగా వచ్చి పరిశీలించడం వల్ల ప్రభుత్వంపై, పాలనపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పల్లెప్రగతిని కేవలం నిర్ణీత కాలానికే పరిమితం చేయకుండా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల అమలు కోసం పల్లెప్రగతి మొబైల్ అప్లికేషన్ తోడ్పడనుంది. ప్రస్తుతం అధికార యంత్రాంగం అంతర్గతంగా మాత్రమే ఈ అప్లికేషన్‌ను వినియోగిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్లికేషన్లోనూ మార్పులు చేర్పులు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండిః అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి: వెంకయ్యనాయుడు