ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర, నారాయణపేట, అలంపూర్, గద్వాల కొల్లాపూర్ నియోజకవర్గాలలో ఉల్లిని అత్యధికంగా సాగు చేస్తారు. కరువు కాలం వచ్చినా తక్కువ నీటితో ఉల్లి సాగు చేయాలని ఈ ప్రాంతాల రైతులు ధరలతో సంబంధం లేకుండా ఏట సుమారుగా 20వేల ఎకరాలలో సాగు చేసి వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందిస్తారు.
ఉల్లి క్రయవిక్రయాలు ఇలా...
కొల్లాపూర్ నియోజకవర్గంలో సాగుచేసిన ఉల్లిని నేరుగా హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్లో...గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సాగుచేసే ఉల్లిని కర్నూల్ మార్కెట్లో విక్రయిస్తారు. దేవరకద్ర నారాయణపేట జిల్లాలో సాగుచేసే రైతులు మాత్రం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేసే దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లోనే అమ్ముతారు.
ప్రధాన మార్కెట్లలో ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో స్థానిక మార్కెట్‌గా ప్రసిద్ధి చెందిన ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర వ్యవసాయ మార్కెట్‌పై ప్రభావం చూపింది.
దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో ఉల్లిధర కింటకు పెరిగింది ఇలా...
కనిష్టం | గరిష్టం | |
నవంబర్ మొదటివారం | రూ.2000 | రూ. 3000 |
రెండో వారం | రూ.2600 | రూ.3400 |
మూడో వారం | రూ.3000 | రూ.4300 |
నాల్గో వారం | రూ.5050 | రూ. 7390 |
డిసెంబర్ మొదటి వారం | రూ.6000 | రూ.8600 |
పెరిగిన ఉల్లి ధరలతో కొనుగోలు చేసేందుకు వినియోగదారులు చూడటం తప్ప కొనలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20రూపాయలకు కిలో ఉన్న ఉల్లి ధర.. నెల రోజుల వ్యవధిలోనే వందకు పెరగడంతో పేద, మధ్యతరగతి వారికి కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఉల్లి కేంద్రాల ఏర్పాటు
పెరిగిన ఉల్లి ధరలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చౌక ధరల దుకాణాల ద్వారా పేద, మధ్య తరగతి వినియోగదారులు కొనుగోలు చేసే స్థాయిలో రాయితీ ధరలతో ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.