మహబూబ్‌నగర్ సమీపంలోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో నాటేందుకు ఉద్దేశించి చేపట్టిన "కోటి విత్తన బంతుల" కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని మహిళా సంఘాలు విత్తన బంతుల తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న వెయ్యి స్వయం సహాయక సంఘాలు పదిరోజుల పాటు ప్రతిరోజూ వంద సంచులు తయారు చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. పది రోజుల్లో లక్షమంది సభ్యులు కోటి విత్తన బంతులు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. నిర్దేశించిన సమయంలో విత్తన బంతుల తయారీ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.
ఈ బంతుల తయారీలో ప్రధానంగా రాగి, మర్రి, జువ్వి, నల్ల తుమ్మ, చింత, మేడి, వేప తదితర విత్తనాలను ఉపయోగిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు శిక్షణలు ఇవ్వటం వల్ల... గ్రామాల వారిగా విత్తన బంతులను తయారు చేస్తున్నారు. కోటి విత్తన బంతుల తయారీ పూర్తయిన అనంతరం... వర్షాలు సమృద్ధిగా ఉన్న తరుణంలో వాటిని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో జిల్లా యంత్రాంగం నాటనుంది.