మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా జిల్లాలో 4 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు మహబూబ్ నగర్ పట్టణానికి చెందినవి కాగా.. దేవరకద్ర మండలం పెద్ద రాజమూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు మహమ్మారి సోకింది.
ఇటీవలే ఆమె ప్రసవించి.. అనారోగ్యం బారిన పడినందున మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వ్యాధి లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్ ఉన్నట్లుగా తేలింది. దీంతో పెద్దరాజమూరు గ్రామాన్ని సందర్శించిన వైద్యులు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది 9 మందిని గృహ నిర్బంధంలో ఉంచారు. పాజిటివ్ కేసుకు ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన మరో ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. ఇటీవల హైదరాబాద్లో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన ఒకరికి వైరస్ సోకినట్లుగా గురువారం నిర్ధరణ అయింది.
ఈ నాలుగు కేసులతో మహబూబ్ నగర్ జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య 34కి చేరింది. వీరిలో ప్రభుత్వాసుపత్రుల్లో 8 మంది, ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురు, హోం ఐసోలేషన్లో 12 మంది ఉన్నారు. 11 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఎస్వీఎస్ ఐసోలేషన్ వార్డులో ఒకరు, జనరల్ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో 28 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒకరూ మాస్కు తప్పనిసరి ధరించాలని, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: సమ్మె విరమించిన గాంధీ జూడాలు