మహబూబ్‌నగర్ జిల్లా అజకోళ్లు గ్రామానికి చెందిన నవనీత కరాటే క్రీడాకారిణి (karate champion). ఆమెకు తండ్రి లేరు. కూలీ పనిచేసుకుంటున్న తల్లితో జీవనం సాగిస్తోంది. 8వ తరగతి నుంచి పాఠశాల మాస్టర్ ద్వారా కరాటేలో మెలకువలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఛాంపియన్ షిప్ సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. ఆమె ప్రతిభ చూసిన కరాటే మాస్టర్ శివ ఆర్థికంగా కూడా సాయం చేశారు. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు మాస్టర్ తన వంతు కృషి చేశారు. అలా అంతర్జాతీయ, జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్‌ల్లో 21 బంగారు, 6 సిల్వర్, 10 రజత పథకాలు గెలిచింది. నేపాల్, చెన్నై, కర్ణాటకతో పాటు 7 అంతర్జాతీయ, 18 జాతీయ, 17 రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించింది. ఒలింపిక్స్‌లో పథకం సాధించడమే తన లక్ష్యం అంటోంది.
నేను ఎనిమిదో తరగతి నుంచి కరాటే నేర్చుకుంటున్నాను. అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో నేను పాల్గొన్నాను. ఇప్పటివరకు 31 మెడల్స్ సాధించాను. ఒలింపిక్స్‌లో పథకం సాధించాలనేదే నా గోల్. నాకు సాయం చేస్తున్న నీవా ఫౌండేషన్ గ్రూప్, రాచాల యుగేందర్ సార్‌కు, ఓంకార్ సార్‌కు నా పాదాభివందనాలు.
-నవనీత, కరాటే క్రీడాకారిణి
శ్రీలంకలో జరగబోయే అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు నవనీత ఎంపికైంది. విజయాలు సాధించే సత్తా ఆమెలో చూసిన సామాజికవేత్త రాచాల యుగేందర్ స్పందించి... దాతల ద్వారా ఆమెకు సాయం చేయాలనుకున్నారు. ఆమె సాధించిన విజయాలు చూసి ఆశ్చర్యపోయిన దాతలు.. మేటా ఇన్ఫోటెక్ సీఈఓ వేణు గోపాల్, నీవా ఫౌండేషన్ అధ్యక్షుడు గణేష్ రెడ్డి, అదితి రెడ్డి ఆమెను పూర్తిగా దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఆమెకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయినా మా అమ్మాయి చిన్నతనం నుంచే ఇలా మంచి పేరు సంపాదించుకుంది. కానీ మమ్మల్ని పట్టించుకునేవాళ్లు ఎవరూ లేరు. మీరే మాకు సాయం చేయాలి సార్.
-శశికళ, నవనీత తల్లి
కరాటేలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ అనేక విజయాలను సొంతం చేసుకున్న యువ క్రీడాకారిణి నవనీతకు ప్రభుత్వం కూడా సాయం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలి.
ఒక అమ్మాయి ఉంది నవనీత అని గణేశ్ చెప్పారు. ఈవెంట్స్‌కు వెళ్లడానికి ఫండ్స్ అరేంజ్ అవడం లేదని అన్నారు. అందుకే మేం దత్తత తీసుకుంటున్నాం. ఈ శ్రీలంక పోటీలకు మాత్రమే కాకుండా భవిష్యత్‌లో నవనీతకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. నవనీతకు సాయం చేయడానికి మరికొంతమంది దాతలు ముందుకు రావాలని కోరుతున్నాం.
- అదితి రెడ్డి, నీవా ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు
ఇదీ చదవండి: లోన్ ఇస్తామంటూ ఫోన్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..