ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారుల్లో ముఖ్యమైనది ఎన్‌హెచ్-167. కర్ణాటక రాష్ట్రంలోని హగరి నుంచి ప్రారంభమై సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఈ రహదారి ముగుస్తుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నుంచి నారాయణపేట జిల్లా కృష్ణా చెక్ పోస్టు వరకు ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనులు దాదాపు పూర్తి కాగా.. మరికల్ నుంచి కృష్ణా చెక్ పోస్ట్, జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ పోలీసు స్టేషన్ వరకూ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జడ్చర్ల నుంచి మహబూబ్ నగర్ పట్టణం వరకూ 16.6 కిలోమీటర్ల రహదారిని విస్తరించాల్సి ఉండగా 60శాతం పనులు పూర్తయ్యాయి. రూ.170 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు ఇప్పటి వరకూ రూ.100 కోట్లు ఖర్చు చేశారు. భూసేకరణ సమస్యల కారణంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మయూరీ హరితవనం వద్ద భూసేకరణ సమస్యల కారణంగా 300 మీటర్ల రోడ్డు విస్తరణ ఆగిపోయింది.
వివాదాలున్న చోట ఆలస్యం
అప్పనపల్లి వద్ద మరో 1200 మీటర్ల రోడ్డుకు భూమిని సేకరించాల్సి ఉంది. అక్కడ 30కోట్లతో ఆర్వోబీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా పట్టణంలో రోడ్డు విస్తరణపై కొందరు కోర్టును ఆశ్రయించడం, కొందరు నిరాకరించడం, ప్రార్థనా మందిరాలు తొలగింపు అంశం, తదితర కారణాల వల్ల పని ఆలస్యమవుతోంది. రెయిలింగ్, డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ మురుగు కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయి. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. వివాదాల పరిష్కారం, భూసేకరణ పూర్తైతే ఈ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది.
త్వరగా పూర్తి చేస్తాం
జడ్చర్ల - మహబూబ్‌నగర్ రోడ్డు విస్తరణ పనుల్లో భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. అవసరమైన భూమిని గుత్తేదారుకు అప్పగించిన 9 నెలల్లో పనులు పూర్తి చేస్తాం. మిగిలిన చోట్ల పనులు పురోగతిలోనే ఉన్నాయి. కోర్టు కేసులు, వివాదాలున్నచోట పనులు ఆలస్యమవుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ ప్రారంభించాల్సి ఉంది. మరికల్ నుంచి చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్ని మే నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం. -రమేశ్‌బాబు, డీఈఈ, నేషనల్ హైవేస్, మహబూబ్‌నగర్
రెండేళ్లుగా కొనసాగుతున్న పనులు
మరికల్ నుంచి నారాయణపేట జిల్లా తెలంగాణ సరిహద్దు వరకూ 45 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు పురోగతిలోనే ఉన్నాయి. మరికల్ మండలం ఎలిగండ్ల వాగు, మక్తల్ మండలం బొందలకుంట, మాగనూరు మండలం పెద్దవాగు, గుడబల్లేరు వద్ద వంతెనలు నిర్మాణం కాలేదు. మక్తల్, మాగనూర్ గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గుడబల్లేరులో రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉంది. రూ.160కోట్లతో పనులు చేపట్టగా ఇప్పటి వరకూ రూ.112 కోట్లు ఖర్చు చేశారు. 68 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో విస్తరణ పనుల్లో జాప్యం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెండేళ్లుగా ఈ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం
గత రెండేళ్ల నుంచి నిర్మాణాలు పూర్తి కాకపోవడం వల్ల నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పడం తప్ప పనులైతే పూర్తి కావడం లేదు. రోడ్లపై బోర్డులు పెట్టకుండా పనులు చేపట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు కిలోమీటర్ల దూరం వచ్చి పనులు జరుగుతున్నాయని వెనక్కి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉంది. డ్రైనేజీ పనుల కోసం రోడ్డుపై గుంతలు తీసి పూడ్చకపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. -తారచంద్రారెడ్డి, అడ్వొకేట్
ఆరు నెలల నుంచి ఏడాది కాలం
జడ్చర్ల - మహబూబ్ నగర్ రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని గుత్తేదారుకు అప్పగించిన 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మరికల్ నుంచి చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్ని మే నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని నేషనల్ హైవేస్ డీఈఈ రమేష్ బాబు వెల్లడించారు. మహబూబ్‌నగర్ నుంచి చించోలి, కల్వకుర్తి- నంద్యాల రహదారులపై ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ఈ రెండు డీపీఆర్‌లు సిద్ధం కావడానికి ఆరు నెలల నుంచి ఏడాది కాలం పట్టేలా ఉంది.
సర్వే వేగవంతం చేస్తాం
కల్వకుర్తి - నంద్యాల జాతీయ రహదారి డీపీఆర్ కోసం ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ప్రైవేటు సంస్థకు కన్సల్టెన్సీ అప్పగించారు. వారికి 10 నెలల సమయం ఇచ్చారు. కాని గడువుకన్నా ముందే సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 3 నెలలు పూర్తయింది. డీపీఆర్ పూర్తైతే టెండర్లు పిలిచి పనులు చేపడతాం. - అశోక్‌రెడ్డి, డీఈఈ, నేషనల్ హైవేస్, కల్వకుర్తి
ఇదీ చదవండి:
Rolling on road: రోడ్డుపై దొర్లుతూ.. రహదారుల దుస్థితిపై వినూత్న నిరసన