మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలను విశ్వవిద్యాలయ స్థాయికి చేరుకునేలా.. సౌకర్యాలు కల్పిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని వైద్య కళాశాలలో విద్యార్థులకు అంతర్జాలం ద్వారా ఏర్పాటు చేసిన త్రీడీ డిజిటల్ తరగతులను ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొట్టమెుదటగా వైద్య విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను ఏర్పాటు చేశామని.. ఇంకా సాంకేతికతను ఉపయోగించుకొని పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్య కళాశాల డైరెక్టర్‌ను ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో సెమినార్లు, సమావేశాల వంటివి ఆన్‌లైన్ విధానంలో ఇక్కడ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి.. వైద్య కళాశాల అనుబంధంగా ఉన్నందున ఆసుపత్రితో పాటు వైద్య కళాశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం వైద్య కళాశాలకు 50 ఎకరాల స్థలం మాత్రమే ఉందని.. భవిష్యత్తులో చుట్టుపక్కల మరో 50 ఎకరాలను గుర్తించి సిద్ధంగా ఉంచాలని అదికారులను ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఫార్మా కళాశాల, డెంటల్, నర్సింగ్‌తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కళాశాలలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతామన్నారు. భవిష్యత్తులో హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చుకునే అవసరం ఎంతైన ఉందన్నారు. ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించి మంత్రి వైద్య విద్యార్థులతో మాట్లాడారు. రెగ్యులర్ విద్యకు, ఆన్‌లైన్ విద్యకు తేడా ఉంటుందని.. కానీ, భవిష్యత్తులో ఆన్‌లైన్ ద్వారానే తరగతులను బోధించే అవకాశం ఉన్నందున విద్యార్థులు అలవాటు పడాలని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు అంశంపై రజత్ కుమార్‌కు వినతిపత్రం