మహబూబ్‌నగర్‌లోని కొత్త మండలం మహమ్మదాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్, విద్యాశాఖ అధికారి కార్యాలయం, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాలను, రైతు వేదికను ప్రారంభించారు. నూతన మండల కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
అన్ని లక్షణాలు ఉన్నాయి..
మహమ్మదాబాద్‌కు మండల కేంద్రానికి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నందున ముఖ్యమంత్రితో మాట్లాడి గండిడ్ నుంచి మాహ్మదాబాద్ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేశామని తెలిపారు. మండలంలోకి వచ్చిన 22 గ్రామ పంచాయతీల ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సాగునీరు తీసుకొస్తాం...
మండలానికి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తీసుకొస్తామని.. పరిగి,తాండూరులకు ఏ విధంగా సాగు నీరు తీసుకురావాలో శాసనసభ్యులతో కలిసి ఆలోచిస్తున్నామని తెలిపారు. నూతన మండలంలోని ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, అధికారులతో స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పారు. నూతన మండలానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. నూతన కార్యాలయంలో ఫర్నిచర్ కోసం వెంటనే 10 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
'మహమ్మదాబాద్ మండలం ఏర్పాటు చేయాలనే 30 సంవత్సరాల కల నేటితో నెరవేరింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని మహమ్మదాబాద్ మండలానికి తీసుకువస్తాం. రూర్బన్ పథకం కింద 30 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు ఆరు నెలల్లో పూర్తవుతాయి' అని శాసన సభ్యులు మహేశ్వర్ రెడ్డి అన్నారు.
మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.. కొత్త మండలం ఏర్పాటు వల్ల రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆయన అన్నారు.
అంతకు ముందు హన్వాడ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రూరల్ స్లాటర్ హౌస్, 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓపెన్ జిమ్‌కు శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి: కరోనా పరిస్థితిపై హైకోర్టులో రేపు అత్యవసర విచారణ