ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులు భవిష్యత్తులో వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొత్తగా 20పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)ను మంత్రి ప్రారంభించారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 900 పడకలు, 30 ఐసీయూ యూనిట్లు ఉన్నాయని.. ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
గతంలో జిల్లా ఆస్పత్రిలో కేవలం 18 మంది డాక్టర్లు, 70 మంది నర్సులు మాత్రమే ఉండే వారని, ఇప్పుడా సంఖ్య 200 మంది డాక్టర్లు, 500 మంది నర్సులకు పెరిగిందన్నారు. 24 గంటల వైద్యం, సాధారణ రోగాలతో పాటు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక రోగాలకు సైతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ. 475 కోట్లతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం వాటరింగ్ డే సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న మొక్కలకు నీళ్లు పెట్టారు.
మొక్కల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ....
జిల్లాలో ఈ సంవత్సరం కోటి మొక్కలు నాటనున్నామని, మయూరి అర్బన్ ఫారెస్ట్‌లో కోటి మొక్కల కోసం విత్తన బంతులు చల్లనున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలలోని మొక్కలకు నీరు పోయడానికి ట్రాక్టర్లు, ట్రాలీలను ప్రభుత్వమే పంపిణీ చేయడం జరిగిందని... గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధతో ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. ప్రతి శుక్రవారం నిర్వహించే వాటరింగ్ డేలో భాగంగా హరితహారంలో నాటిన మొక్కలకు నీరు పోయాలన్నారు.
ఇదీ చూడండి: వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్