మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జిల్లాకు రానున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ముఖమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా ప్రగతి పథంలో అగ్రభాగాన ఉండనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఐటీ పార్క్‌లో పరిశ్రమలు, పారిశ్రామిక కారిడార్ సహా అనే అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని... వారిని ప్రొత్సహించేందుకే చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. మరుగున పడుతున్న వృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. కరోనా వచ్చిందని ఇంటికే పరిమితం కాకూడదని.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేశామని.. మరి కొద్ది రోజుల్లో వెంటిలేటర్లు సైతం అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇదీ చూడండి: 30 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మించాం: కేటీఆర్