పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని అన్ని కుంటలను సాగునీటితో నింపుతామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. వేసవిలోనూ చెరువులు కుంటలను సాగునీటితో నింపుతున్నామన్న మంత్రి... రాష్ట్రంలో వెయ్యి గురుకులాలు తీసుకురావడమే లక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా నిధులను పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తున్నదని గుర్తుచేశారు. గ్రామాభివృద్ధిపై యువత దృష్టి సారించడమే కాకుండా సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మార్పులు వచ్చాయని అన్నారు. గతంలో విద్యుత్, తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, పింఛన్లు, రెండు పడక గదుల ఇళ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇలా ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. ప్రజలు రాజకీయాలకతీతంగా పని చేసి మూసాపేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే అన్నారు. రైతులను రాజుల చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, ఎంపీపీ కళావతి, మూసాపేట సర్పంచ్ అన్నపూర్ణ, మండల రైతు బంధు కో ఆర్డినేటర్ రఘుపతి రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు యశ్వంతరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి: కలివిడిగా నిలబడి.. కొవిడ్‌తో తలపడి!