మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రాన్ని నలువైపులా అభివృద్ధి చేసి.. సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దుతామని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని కొత్త చెరువులో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బోటింగ్‌ను ఆయన ప్రారంభించారు.
కొత్తచెరువు ద్వారా గతంలో మహబూబ్‌నగర్ పట్టణానికి తాగు నీరు మాత్రమే వచ్చేదని, ఇప్పుడు కృష్ణా నది నీటితో నింపి.. కొత్త చెరువును శాశ్వతంగా చేపల చెరువుగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ చెరువు మహబూబ్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నందున పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ క్రమంలోనే చెరువులో ప్రస్తుతం ఒక స్పీడ్ బోటుతో పాటు 3 స్పెడల్ బోట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అనంతరం స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మల నిమజ్జనంలో పాల్గొన్నారు.
అనంతరం స్థానిక క్రౌన్ ఫంక్షన్ హాల్లో సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరు పేదలకు, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమర్ధనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హన్వాడ మండల కేంద్రంలో చించోలి-మహబూబ్‌నగర్ బీటీ రోడ్డు పనులకు, మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న దర్పల్లిలో రూ.24 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇదీ చూడండి.. ఆత్మగౌరవంతో పండుగలు జరుపుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్