పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని పట్టణాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. తొలుత మెట్టుగడ్డ డైట్ కళాశాల మైదానంలో శాకాహార, మాంసాహార మార్కెట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో షీ టాయిలెట్స్‌కు శంకుస్థాపన చేశారు. రైల్వేస్టేషన్ రోడ్డులో సెంట్రల్ లైటింగ్, బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఓపెన్ ఎయిర్ జిమ్, ఇండోర్ జిమ్ ప్రారంభించారు.
మార్గనిర్దేశం
అనంతరం పాత తోట మురికి వాడలో పాదయాత్ర చేస్తూ అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ తరహాలో పారిశుద్ధ్య కార్మికులను వార్డు ప్రజలకు పరిచయం చేయాలని అధికారులను ఆదేశించారు. 10 రోజుల పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులు, కమిటీలు, కౌన్సిలర్ల బాధ్యతలు, విధి నిర్వహణపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
చెత్తతో ఆదాయం
తడి, పొడి చెత్త సేకరణ కోసం బుట్టలు పంపిణీ చేస్తే వాటిని ఇతర అవసరాలకు వినియోగించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తలను ప్రజలే వేరు చేసి ఇవ్వడం ద్వారా సిరిసిల్లలో నెలకు 3 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని వివరించారు. పాలమూరులోనూ వేరు చేయాలని, అలా చేయని ఇళ్ల నుంచి భవిష్యత్తులో చెత్త సేకరించవద్దని సిబ్బందికి ఆదేశిస్తామన్నారు.
85 శాతం బతకాలి
మున్సిపాలిటీ వార్షిక బడ్జెట్లో 10 శాతం నిధులు పచ్చదనానికే కేటాయించాలని మంత్రి ఆదేశించారు. వార్డులు, ఖాళీ స్థలాలతోపాటు ఇళ్లల్లో మొక్కలు పెంచాలని, జనం అడిగిన మొక్కల్ని గ్రీన్ బ్రిగేడ్ సభ్యులు పంపిణీ చేయాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని లేదంటే కౌన్సిలర్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉందని తెలిపారు. పట్టణ ప్రగతిలో నిరక్షరాస్యులను గుర్తించి, వారికి చదువు నేర్పడం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణను నిలపాలన్నారు.
లంచం ఇవ్వొద్దు
భవననిర్మాణ అనుమతుల కోసం ఎవరూ లంచం ఇవ్వొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్త పురపాలక చట్టం ప్రకారం 75 గజాల్లో నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించుకుంటే మున్సిపాలిటీ అనుమతి అవసరం లేదని గుర్తు చేశారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా ఇల్లు నిర్మించి పన్నులు చెల్లించవచ్చని.. తప్పుడు సమాచారం అందిస్తే 25 రెట్లు అపరాధ రుసుము విధించే అధికారం మున్సిపాలిటీకి ఉంటుందని హెచ్చరించారు. పౌరుడే కేంద్రంగా నూతన పురపాలక చట్టం రూపొందించామని వివరించారు.
రేపు కల్వకుర్తికి కేటీఆర్
పట్టణ ప్రగతిలో భాగంగా సుమారు 60 మందితో ఏర్పాటు చేసిన కమిటీలే చురుగ్గా పనిచేయాలని.. తద్వారా కౌన్సిలర్లు సైతం పరుగులు పెడతారన్నారు. రేపు నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.
- ఇదీ చూడండి : ట్రంప్‌తో దావత్ కోసం రేపు దిల్లీకి సీఎం కేసీఆర్