Mahbubnagar Vocational College Problems : మహబూబ్‌నగర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ఏకైక వృత్తి విద్యా కళాశాల. ఇక్కడ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, కంప్యూటర్ సైన్స్, గ్రాఫిక్స్-యానిమేషన్, రిటైల్ మేనేజ్మెంట్, అంకౌట్స్- టాక్సేషన్, ఎమ్ఎల్టీ, ఎమ్పీహెచ్డబ్ల్యూ, ఎల్ఎమ్డీటీ తదితర పది రకాల కోర్సులున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ కోర్సులు నేర్చుకుంటున్నారు. ఒక్కో కోర్సుకు 2 తరగతి గదుల చొప్పున 20 గదులు, 7 ప్రయోగ శాలలు అంటే సుమారు 27 గదులు అవసరం.
కానీ ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నది కేవలం 7 షెడ్లు మాత్రమే. ఈ షెడ్లలోనే తరగతులు, ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. 7 తరగతులు పోనూ మిగిలిన విద్యార్థులు పక్కనే అసంపూర్తిగా ఉన్న భవనంలో కోర్సులు నేర్చుకుంటున్నారు. కిందే కూర్చుని పాఠాలు వింటున్నారు. బెంచీలు లేవు. బోర్డులు లేవు. విద్యుత్ లేదు. ఫ్యాన్లు లేవు. కాగితపు సంచులు కింద వేసుకుని రోజంతా నేలపైనే చదువులు కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు చెట్లకిందే తరగతులు నిర్వహిస్తారు. 250 మంది బాలికలకు.. ఉన్న మూత్రశాలలు చాలడం లేదు.
తరగతుల వారీగా అవసరాలు తీర్చుకోవాల్సి వస్తోంది. బాలురకు మూత్రశాలలే లేవు. పక్కనున్న బాలుర జూనియర్ కళాశాల మూత్రశాలల్ని ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సుల బోధన విషయంలో మహబూబ్‌నగర్ కళాశాలకు మంచి పేరున్నా.. వసతులు లేకపోవడంతో అక్కడ చేరిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారింది. ఈ సమస్యలన్నింటికీ ఏకైక పరిష్కారం అసంపూర్తిగా ఉన్న నూతన భవనాన్ని పూర్తి చేయడమే. 2017లో రూ.2 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో కొత్త కళాశాల భవన నిర్మాణాన్ని చేపట్టారు. దాదాపు 70 శాతం పనులు పూర్తయ్యాయి. కాని గుత్తేదారుకు చెల్లించాల్సిన బిల్లుల్ని ప్రభుత్వం సకాలంలో చెల్లించలేదు.
సగం నిధులు విధిలించి చేతులు దులుపుకుంది. దీంతో గుత్తేదారు నిర్మాణ పనులు నిలిపివేశారు. మూడేళ్లుగా భవన నిర్మాణ పనులు ఆగిపోయినా పట్టించుకున్న నాధుడు లేడు. భవనం అందుబాటులోకి వస్తే కళాశాల సమసలన్నీ తీరినట్లే. నిర్మాణం పూర్తైతే అవసరమైన సామగ్రిని పంపేందుకు ఉన్నత విద్యాశాఖ సిద్ధంగా ఉంది. కానీ భవన నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియక అటు విద్యార్థులు, అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు.
మహబూబ్‌నగర్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రస్తుతం వృత్తి విద్యాకోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య సైతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అలాంటి సమయంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక వృత్తి విద్యా కళాశాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపి భవన నిర్మాణాన్ని పూర్తి చేయించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: