Mahbubnagar Rains 2023 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. 15 రోజుల ముందు వరకు ఆశించిన వర్షంలేక ఏ పంటలు వేయాలన్న సందిగ్ధంలో ఉన్న కర్షకులు ప్రస్తుతం పంటల సాగుకి ముందుకెళ్తున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వారంవరకి లోటు వర్షపాతం నమోదు కాగా.. ఇప్పుడు మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అధిక వర్షపాతం.. వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
Mahbubnagar Rains Updates : మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని 6మండలాల్లో అత్యధికంగా వానలు కురిశాయి. పాలమూరు జిల్లాలో సాగు ఊపందుకుంది. పాలమూరు జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 18 లక్షల ఎకరాలు కాగా.. ఈసారి 20లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారుల అంచనా. జూలై మొదటివారంలో సాగువిస్తీర్ణం 40 శాతం దాటలేదు. ఇప్పుడు వానలకు వరిసాగు ఊపందుకోనుంది. వరుణుడి కరుణ కోసం ఎదురుచూసిన అన్నదాతలు నార్లుపోసుకొని ఉంచారు. వర్షాలు కురవడం, భూగర్భ జలమట్టాలు పెరగడం.. జూరాల వంటి ప్రాజెక్టుకు వరద మొదలుకావడంతో బోరుబావులు, చెరువులు, కుంటలు సహా... సాగునీటి ప్రాజెక్టుల కింద వరి ఊపందుకోనుంది. సుమారు ఐదున్నర లక్షల ఎకరాల్లో.. ఈసారి వరి సాగయ్యే అవకాశం కనిపిస్తోంది.
"వర్షాలు పడటం వల్ల చెరువుల్లోకి నీరు చేరి కళకళలాడుతున్నాయి. ఇన్నాళ్లు నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మేం పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది. బోర్లు ఉన్నవారు ముందుగానే పంట వేశారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేం కూడా పంట వేస్తాం." - రైతులు
Telangana Rains 2023 : ఇటీవలి వర్షాలతో పత్తికి జీవంవచ్చింది. వర్షాభావ పరిస్థితి కొనసాగితే పంట నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. కానీ అధిక వర్షం నమోదుకావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. 10 లక్షల ఎకరాల్లో పత్తిసాగవుతుందని అధికారులు అంచనా వేయగా..5లక్షలు దాటలేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మే, జూన్‌లో వేసిన విత్తుల్ని రైతులు నష్టపోవాల్సి వచ్చింది.
జూన్ నెలాఖరు, జులై మాసంలో వేసిన విత్తులే మొలకెత్తాయి. ఎండిపోతున్న ఆ మొక్కలకు తాజావానలతో ప్రాణంవచ్చింది. జొన్న, కంది, మొక్కజొన్న సహా వర్షాధార పంటలకు వానలు జీవం పోశాయి. వానల్లేవని ఏ పంట సాగు చేయని రైతులు నీటివనరులను దృష్టిలో పెట్టుకుని ముందస్తు యాసంగిలో వేరుశనగ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల మేరకు.. వరిసాగు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కూరగాయల రైతులు మాత్రం తెరపి లేకుండా వర్షంకురిస్తే నష్టపోవాల్సిందేనని వాపోతున్నారు.
వానలు పంటలపై సానుకూల ప్రభావం చూపినా.. తెరపి లేని వానల వల్ల కలుపు, చీడపీడలు సోకే అవకాశం ఎక్కువగా ఉందని.. ఆ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కేవలం వ్యవసాయ విస్తరణాధికారుల సూచన మేరకు మాత్రమే... పురుగు మందులు వాడాలని చెబుతున్నారు.
"మహబూబ్‌నగర్ అన్ని జిల్లాల్లో 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాధారిత రైతులే మహబూబ్‌నగర్‌లో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. వారికి ఇదొక శుభవార్త పత్తి, మొక్కజొన్న, జొన్న, కందులు ఇలాంటి పంటలు వేసిన రైతులకు చాలా ఉపయోగకరం." - వెంకటేశ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి
ఉమ్మడి పాలమూరు జిల్లాల్లోని 76 మండలాల్లో దాదాపు అన్ని మండలాల్లో సాధారణ, అధిక వర్షాలు నమోదు కాగా.. 9 మండలాల్లో మాత్రం ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 5 మండలాలు, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి, వనపర్తి జిల్లా ఆత్మకూర్, చిన్నంబావి మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది. ఇలాంటి మండలాల్లో రైతులు సాగు విషయంలో ఆలోచించి ముందుకు సాగాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: