మహబూబ్‌నగర్ పట్టణంలో ముంపు సమస్య.. లోతట్టు కాలనీలవాసులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గంటపాటు వర్షం గట్టిగా కురిస్తే.. రామయ్యబౌలీ, శివశక్తినగర్, బీకేరెడ్డి కాలనీ, కుర్హినిశెట్టికాలనీ, గణేశ్ నగర్ ప్రాంతాలు వరదతో నిండిపోతున్నాయి. భారీ వర్షం కురిస్తే వరద నీరు రహదారులపై ప్రవహించడమే కాకుండా ఇళ్లలోకీ చేరుతోంది. ఎడతెరపి లేని వానలు కురిస్తే లోతట్టు ప్రాంతవాసుల కష్టాలు అంతాఇంతా కాదు. ఇంట్లో ఉండలేక, బయటకు వెళ్లలేక నానా అవస్థలు పడుతుంటారు. మంచినీరు, నిత్యావసరాలు దొరకడం సైతం కష్టమవుతుంది. దుర్గంధం, దోమలు, రోగాలతో సతమతమవుతున్నారు.
పాలమూరులో పెద్ద చెరువు నిండినప్పుడల్లా ముంపు సమస్య వచ్చినా.. అంత తీవ్రంగా ఉండేది కాదు. పట్టణంలోని మురుగంతా 3 కాల్వల ద్వారా అబ్దుల్ ఖాదర్ దర్గా, కొత్త బస్టాండ్, శాసాహెబ్‌గుట్ట గుండా పెద్ద చెరువులోకి చేరేది. చెరువు నిండితేనే దిగువన ముంపు సమస్య ఏర్పడేది. ప్రస్తుతం మురుగునీరు చెరువులో చేరకుండా.. అబ్దుల్ ఖాదర్ దర్గా నుంచి వచ్చే కాల్వను.. రామయ్య బౌలీ వైపు వెళ్లే అలుగుకు కొత్త బస్టాండ్, శాసాహెబ్ గుట్ట నుంచి వచ్చే కాల్వల్ని బీకేరెడ్డి కాలనీ వైపు వెళ్లే అలుగు వైపు మళ్లించారు. ఈ మురుగు నీటికి భారీ వానల కారణంగా వచ్చే వరద నీరు తోడవడంతో కాల్వల సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో వరద నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి పోటెత్తుతోంది. ఏడాది కాలంగా సమస్య మరింత తీవ్రమైంది.
వరద కాల్వలను నిర్మించడమే శాశ్వత పరిష్కారం..: మరోవైపు పెద్ద చెరువు రెండు అలుగుల్లోంచి బయటికొచ్చే నీటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ.. దశాబ్దాల కాలంగా వెలిసిన ఆక్రమణలే ముంపు సమస్యకు అసలు కారణమని అధికారులంటున్నారు. ఈ మేరకు పెద్దచెరువు బఫర్ జోన్‌లో 30, రామయ్యబౌలీ అలుగు వైపు 65కి పైగా ఆక్రమణలను గతంలో నిర్వహించిన సర్వేలో గుర్తించారు. వాటిని తొలగిస్తూ 100 అడుగుల వెడల్పుతో వరద కాల్వలను నిర్మించడమే శాశ్వత పరిష్కారమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ముంపుపై అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వచ్చే ఏడాది నాటికి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు.
శాశ్వత పరిష్కారం లభించేనా..: ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నట్లుగా.. వచ్చే ఏడాది నాటికి శాశ్వత పరిష్కారం అమల్లోకి వస్తుందా అన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారులు గుర్తించిన ఆక్రమణలను తొలగించడం సవాల్‌గా మారనుంది. మరోవైపు ఆక్రమణలు తొలగించి, వరద కాల్వల నిర్మాణం పూర్తయ్యే వరకూ ఏటా వానాకాలంలో తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ముంపు బాధితులను వేధిస్తున్నాయి.
ఇవీ చూడండి..
పంటలను దెబ్బతీసిన వర్షాలు.. కొండెక్కిన కూరగాయల ధరలు
హనుమంతుడికి రైల్వేశాఖ నోటీసులు.. స్థలం ఖాళీ చేయాలని ఆదేశం.. అసలేమైంది?