మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు కళావతి. ఆ పాఠశాలకు ఉపాధ్యాయురాలిగా వెళ్లినప్పుడు ఒక్క విద్యార్థి ఉండేవాడు కాదు. బోధనలో తనదైన శైలిని తల్లిదండ్రులకు వివరించడంతో 17 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. కుందేలు, మొసలి, కోతి, నెమలి, ఎద్దు, ఎలుగుబంటి ఇలా సుమారు 50 రకాల బొమ్మల్ని... బోధన కోసం సిద్ధం చేసుకున్నారు. ఐదో తరగతి వరకు బొమ్మల్ని ఉపయోగించి పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు.
చదువులో ఆటల్నిభాగస్వామ్యం చేస్తూ...
పిల్లల చదువులో ఆటల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా బోధనను సులభతరం చేయాలని... దేశీయ బొమ్మల తయారీని ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే కేంద్ర జౌళీశాఖ అధ్వర్యంలో జరిగే జాతీయ బొమ్మల ప్రదర్శనలో ఈసారి విద్యాశాఖను సైతం భాగస్వామ్యం చేసింది. బొమ్మలు, ఆటలతో పిల్లలకు చదువులు చెప్పే గురువులు, పాఠశాలలు ఈసారి జాతీయ బొమ్మల ప్రదర్శన-2021లో పాల్గొనాలని ఆహ్వానించింది. ఈ మేరకు కళావతి 9 విభాగాల్లో 50కి పైగా బొమ్మలను పంపగా.. 5 విభాగాల్లోని 5 బొమ్మలు జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి.
21లో ఐదు ఆమెవే...
రాష్ట్రంలో 11 ప్రభుత్వ పాఠశాలల నుంచి 21 బొమ్మలు ఎంపికైతే అందులో ఐదు కళావతివే కావడం విశేషం. రాష్ట్రం నుంచి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న ఏకైక ప్రాథమిక పాఠశాల సైతం ఇదే. జాతీయ ప్రదర్శనకు తన బొమ్మలు ఎంపికైనందున... ఆనందంగా ఉందని ఉపాధ్యాయురాలు పేర్కొన్నారు.
ఏటా దిల్లీలో జరిగే జాతీయ బొమ్మల ప్రదర్శనను ఈ ఏడాది కరోనా నిబంధనల కారణంగా వర్చువల్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 27 నుంచి జరిగే ప్రదర్శనలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బొమ్మల్ని సైతం చూడొచ్చు.
ఇదీ చూడండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి