మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో లారీ ఢీకొని రైతు నర్సింహులు మరణంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధానంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ తీవ్రంగా స్పందించారు. కృత్రిమంగా ఇసుక తయారు, అక్రమ రవాణా విషయంలో నవాబ్‌పేట, రాజాపూర్ మండలానికి చెందిన 12 మంది రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇందులో పూర్తిస్థాయి విచారణ చేసి సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు ప్రభుత్వ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
ఈ వ్యవహారంలో 12 మంది రెవెన్యూ అధికారుల చర్యలకు కలెక్టర్ రంగం సిద్ధం చేయడం వల్ల అధికార వర్గాల్లో గుబులు మొదలైంది. ఇందులో ఇద్దరు తహసీల్దార్లకు మెమోలు జారీ చేయడం, ఇద్దరు రెవిన్యూ ఇన్స్పెక్టర్‌లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఇద్దరు వీఆర్వోలు, ఆరుగురు వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు ప్రతిపాదించినట్టు కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
తిరుమలాపూర్‌లో కృత్రిమంగా ఇసుక తయారు చేస్తున్న చుక్క వెంకటేశ్, ఇసుక లారీ యజమాని శ్రీధర్, లారీ డ్రైవర్ రాజుపై రాజాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతోపాటు ఇసుక అక్రమ రవాణా విషయంలో రెవెన్యూ యంత్రాంగం గ్రామ వీఆర్ఏలు ఇస్తారయ్య, నర్సమ్మపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దారు శంకర్ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆగని కృత్రిమ ఇసుక దందా... అధికారులకు పట్టింపు కరవు..