వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా కేంద్రంలో, మండల స్థాయి అధికారులు వారి వారి కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని... అధికారులెవ్వరూ ఎలాంటి సెలవులపై వెళ్లకూడదని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల సాధారణ జీవితానికి ఇబ్బందులు కలగకుండా మండల ప్రత్యేక అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు తెగిపోయినా, గండ్లు పడినా, లోతట్టు ప్రాంతాలు దెబ్బ తిన్నా, ఆయా ప్రాంతాల్లోకి నీరు వచ్చినట్లైతే వెంటనే వాటిని పునరుద్ధరించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
వర్షాలకు ఇళ్లు దెబ్బతిన్నట్లైతే పరిశీలించి నివేదిక సమర్పించాలని పురపాలక, మండల, గ్రామ పంచాయతీ స్థాయి అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల నీటి ప్రవాహం ఎక్యువయ్యే ప్రాజెక్టులు, వాగులు, చెరువులు, రహదారులపై వీఆర్ఏలను ఉంచాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఇవీ చూడండి: భారీగా చేరిన వరద నీరు.. నిండి పారుతున్న కోయిల్ సాగర్!