మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురికాకుండా, అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖ అధికారులతో సమీక్షించిన కలెక్టర్... ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పరిరక్షించేందుకు రెవెన్యూ, పురపాలక, నీటిపారుదల శాఖ, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆక్రమణలపై ఉక్కు పాదం మోపాలని, ఎఫ్‌టీఎల్‌లను గుర్తించాలని ఆదేశించారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు అందరూ కలిసి పని చేస్తే చెరువులను, భూములను కబ్జాలకు గురి కాకుండా పరిరక్షించుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో ఆన్‌లైన్ విద్యాబోధనను వంద శాతం మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులందరూ హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో మొత్తం 61వేల 327 మంది విద్యార్థులు ఉన్నారని... ఇందులో 5వేల 310 మంది విద్యార్థులకు టీవీలు లేనట్టు గుర్తించామన్నారు. వీరిని గ్రామపంచాయతీలలో ఉన్న టీవీలతో అనుసంధానం చేసి తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులతో పాటు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రత్యేకించి ఆన్‌లైన్ విద్యా విధానంపై ఒక కరపత్రాన్ని రూపొందించి తల్లిదండ్రులకు, మహిళా సంఘాలకు అందజేశామన్నారు. విద్యాబోధనకు తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లతో పాటు సూచనలు, సలహాలు పేర్కొన్నామన్నారు.
ఇవీ చూడండి: ఓ వైపు డీజీపీ పర్యటన.. మరో వైపు కూంబింగ్.. అందుకేనా..!