పాలమూరులో మద్యం అమ్మకాల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ఇస్తూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు బారులు తీరిన మద్యం ప్రియులను మద్యం దుకాణాల వద్ద పోలీసులు కట్టడి చేయాల్సి వచ్చింది. మొదటి, రెండు రోజులు అమ్మకాలు సాగినా.. ఆ తర్వాత మద్యం షాపుల వద్ద సందడి కనిపించలేదు. తొలిరోజు వరుసలో నిలబడి మద్యం కొనుగోళ్లు చేసిన వారిలో అత్యధికులు కూలీలే.
ప్రస్తుతం వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్తుండటంతో కొనుగోళ్లపై ప్రభావం పడి, మద్యం అమ్మకాల్లో క్రమంగా తగ్గుదల నెలకొంది. మొదటి రోజు రూ. 7.50 కోట్ల మేర అమ్మకాలు సాగాయి. తర్వాత రూ.5 కోట్లకు పడిపోయాయి. తాజాగా రోజు రూ.4.50 కోట్ల మేర అమ్మకాలు సాగుతున్నాయి.
దుకాణాల్లో నిల్వలు.. : లాక్‌డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో మద్యం అమ్మకాలు అధికంగా ఉంటాయని అంచనా వేసిన వ్యాపారులు అప్రమత్తమయ్యారు. మొదటి రోజు బారులు తీరిన విధానం చూసిన వ్యాపారులు భారీగా సరకు కొనుగోలు చేసి నిల్వ చేశారు. రెండో రోజే దుకాణాల ఎదుట వరుసలు లేకపోవడంతో కంగుతిన్నారు. తీరా అంచనాలు తప్పడంతో అంతర్మథనంలో పడిపోయారు.
మద్యం కొనుగోళ్లు అధికంగా ఉండే మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని దుకాణాల్లో రూ. 20 లక్షల నుంచి రూ. 25లక్షల వరకు నిల్వలు ఉండటం గమనార్హం. పూర్తి స్థాయిలో వ్యాపారాలు ప్రారంభమై, సాధారణ ప్రజా జీవితం కొనసాగే వరకు పరిస్థితులు ఇదే విధంగా ఉంటాయని దుకాణ నిర్వాహకులు భావిస్తున్నారు. మద్యం అమ్మకాల్లో కొంత తగ్గుదల ఉందని, బీర్ అమ్మకాలలో మాత్రం గణనీయంగా తగ్గుదల కనిపించిందని అబ్కారీ శాఖ జిల్లా అధికారిణి (ఈఎస్) అనిత తెలిపారు. చల్లని బీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని ప్రచారం సాగడమే కారణం కావచ్చని ఆమె విశ్లేషించారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో అమ్మకాల తీరు..
ఈ నెల 6-10 తేదీల్లో మద్యం అమ్మకాలు.. : రూ. 37.91 కోట్లు
ఈ నెల 18-22 తేదీల్లో మద్యం అమ్మకాలు.. : రూ. 25.92 కోట్లు