ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజూ సగటున సహాయ కేంద్రం నంబరుకు 40 నుంచి 60 ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. అందులో 25 వరకు ఒక్క మహబూబ్‌నగర్ కాల్‌సెంటరుకే వస్తున్నాయి. వంతుల వారీగా ఈ సహాయ కేంద్రాల్లో పలువురు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్ స్వీకరిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. మరోవైపు కొవిడ్ పరీక్షలు చేసుకున్న వారి వివరాలు రోజూ వైద్యారోగ్యశాఖ నుంచి సహాయ కేంద్రానికి వస్తాయి.
అలా వచ్చిన నంబర్లకు కేంద్రం సభ్యులు ఫోన్ చేసి వారికి పరీక్షల్లో ఏం ఫలితాలు వచ్చాయి.. కొవిడ్ కిట్లు అందాయా.. క్వారంటైన్ ఎక్కడ ఉంటున్నారు.. తదితర విషయాలు ఆరా తీస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. ఆయనకు నెగటివ్ వచ్చిందని వైద్యులు ఇంటికి పంపించారు. సహాయ కేంద్రానికి మాత్రం పాజిటివ్ వచ్చిందని సమాచారం వెళ్లింది. సమాచార లోపంతో ఈ పరిస్థితి నెలకొంది. వెంటనే ఆ వ్యక్తికి కేంద్రం సభ్యులు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం ఇవ్వడంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
మహబూబ్‌నగర్ సహాయ కేంద్రానికి ఇటీవల జిల్లా కేంద్రం నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ‘మా ఇంటి పక్క వ్యక్తికి కొవిడ్ వచ్చింది. ఆయన తరుచూ బయటకు వచ్చి మా ఇంటి ముందే వాంతులు చేసుకుంటున్నారు. చెబితే వినడం లేదు. సమస్యను పరిష్కరించండి’ అంటూ అవతలి వ్యక్తి విజ్ఞప్తి చేశారు. వెంటనే అధికారులు హెల్ప్‌డెస్కు నుంచి కొవిడ్ సోకిన వ్యక్తికి ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు.
రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ అర్జంటుగా కావాలంటూ ఓ మహిళ నుంచి నారాయణపేట జిల్లా సహాయ కేంద్రానికి ఫోన్ వచ్చింది. సహాయ కేంద్రం వారు వెంటనే ఈ విషయాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు సమస్యను పరిష్కరించారు.
మహబూబ్‌నగర్‌లో ఒకటే నంబరుతో ఇబ్బందులు..
మహబూబ్‌నగర్ సహాయ కేంద్రానికి ఒకటే ఫోన్ నంబరు కేటాయించారు. అత్యధిక కాల్స్ దీనికే వస్తున్నాయి. దీంతో తరచూ ఈ నంబరు బిజీగా వస్తోందని పలువురు చెబుతున్నారు. మిగతా జిల్లాల్లో రెండు, మూడు నంబర్లు కేటాయించారు. దీంతో అక్కడ సమస్యలు రావడం లేదు.
ఇదీ చూడండి: కరోనా కాలంలో మహిళలపై పెరిగిన వేధింపులు