Harish Rao Fires On Central Government: వైద్యరంగంలో తెలంగాణ ముందుందని.. కానీ కేంద్ర మంత్రులు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవన స్థలంలో వెయ్యి పడకల నూతన సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంఖుస్థాపన చేశారు.
కేంద్రం కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తుంది: పేద ప్రజలకు వైద్యం అందించడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 3వ స్థానం ఇవ్వగా.. కేంద్రమంత్రి మహేంద్రనాథ్ ఉన్న ఉత్తరప్రదేశ్ చిట్టచివరి 28 స్థానంలో ఉందని తెలిపారు. కానీ ఈ కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు తెలంగాణలోని అమలు చేస్తున్న ప్రతి పథకం దేశానికి, రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయని చెప్పారు. ఆ పథకాలనే కేంద్రం కాపీ కొట్టి దేశంలో అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం మూడు కాలేజీలు మాత్రమే: 2014లో అటు కేంద్రంలోని బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎంబీబీఎస్ సీట్లు దేశంలో 71 శాతం పెరుగగా.. రాష్ట్రంలో 127 శాతం పెరిగాయని హరీశ్‌రావు అన్నారు. దేశంలో పీజీ సీట్లు 68 శాతం పెరిగితే.. తెలంగాణలో 112 శాతంకు పెరగాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకులు ఉన్నా.. 60 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన కాలేజీలు కేవలం మూడు మాత్రమేనని గుర్తుచేశారు.
అన్ని కళాశాలలు మహబూబ్‌నగర్‌కు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడు వైద్య కళాశాలలు వస్తే.. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మూడు కళాశాలలు ఏర్పాటు చేశామని హరీశ్‌రావు అన్నారు. ఈ నెలఖారులోగా రాష్ట్ర వ్యాప్తంగా 969 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లను నియమించనున్నామని చెప్పారు. మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను మరో రెండు నెలలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్యారోగ్యశాఖలో ఎన్ని చదువులు ఉన్నాయో అన్ని కళాశాలలు మహబూబ్‌నగర్‌కు వచ్చాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో క్యాత్ ల్యాబ్‌తో పాటు.. క్యాన్సర్ వైద్యం కూడ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. మహబూబ్‌నగర్‌కు నూతనంగా మంజూరైన నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఈ ఏడాదిలోనే పారా మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
కృష్ణానది జలాల్లో వాటాలు తేల్చాలి: పాలమూరు మీద ప్రేమ ఉంటే కేంద్రం కృష్ణా నదీ జలాల్లో వాటాలు తేల్చాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదుల సంఖ్యలో దరఖాస్తులు పెట్టిన కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. 78శాతం నదీ పరివాహక ప్రాంతం ఉన్న తమకు నీటి కేటాయింపులు చేయకుండ బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకుని ఏడాది గడిచిన ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ జలాల వాటా తేల్చకుండా అడ్డుపడుతుంది ఎవరని ప్రశ్నించారు. దాని కారకులు ఎవరో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలమూరులో ఉన్న పేదరికాన్ని సాకుగా చూపిన నాయకులు అప్పులు పొంది.. ఆంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చేసుకున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తెలంగాణ నుంచి రూ.46,000 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి డబ్బులు కడుతున్నా.. అందులో సగం నిధులు కూడా తిరిగి ఇవ్వడం లేదని విమర్శించారు.
ఇవీ చదవండి: బీజేపీతో పొత్తుపెట్టుకునేందుకే చంద్రబాబు డ్రామాలు: హరీశ్‌రావు
భారత్- చైనా 17వ విడత చర్చలు.. సరిహద్దు సమస్యకు త్వరలోనే పరిష్కారం!