మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో 550 మంది విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగుతోంది. దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, మూసాపేట, అడ్డాకుల, మహబూబ్ నగర్ గ్రామీణ మండలాల్లోని సుమారు 40 గ్రామాల విద్యార్థులు ఇంటర్ చదివేందుకు దేవరకద్రకు వస్తుంటారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉదయం ఏడు గంటలకు గ్రామాల నుంచి బయలుదేరితే తప్ప.. కళాశాల సమయానికి చేరుకోలేని పరిస్థితి. ఉదయం పూట తినకుండా వచ్చే విద్యార్థులు 50 శాతం ఉండటం సాధారణం. మిగతావారు మధ్యాహ్నం భోజనానికి లంచ్ బాక్సులు తెచ్చుకున్నా.. వాటిల్లో అన్నంతో పాటు ఏ పచ్చడో లేక మిరప పొడో తప్ప.. కూర కనిపించడం అరుదు. ఆకలితో ఆ బాక్సుల్లోంచి కొంత తిన్నా.. రుచిగా లేక సగం అన్నాన్ని పారవేయడం కనిపిస్తుంటుంది.
సంకల్పంతో..
కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఊర్మిళాదేవి.. తన విద్యార్థులు మధ్యాహ్న సమయంలో సరైన భోజనం చేయడం లేదని గ్రహించారు. అందుకే వారికి కడుపు నిండా తినేలా చూడాలని సంకల్పించారు. వారు తెచ్చుకునే అన్నానికి కాస్త రుచికరమైన కూరను అందిస్తే చాలు వారి ఆకలి తీరుతుందని అనుకున్నారు. అందుకు అవసరమైన చర్యలను అధ్యాపక బృందం సమక్షంలో చేపట్టారు. కూరలు చేసేందుకు కావాల్సిన సామగ్రిని తాను తెప్పించి.. వాటిని వండేందుకు ముందుకు రావాలని అధ్యాపకులను కోరారు.
సమైక్యతతో..
ఉపాధ్యాయులు వారికి తరగతులు లేని సమయంలో.. విద్యార్థుల సంఖ్యను బట్టి వంటను ప్రారంభించేవారు. మధ్యాహ్నం గంట మోగిందంటే చాలు.. విద్యార్థులు అన్నం బాక్సులతో కర్రీ గిన్నెల దగ్గర వాలిపోతారు. అధ్యాపకులు దశలవారీగా వారికి వడ్డించిన అనంతరం వారు భోజనం చేస్తారు. కళాశాల ప్రిన్సిపల్, టీచర్లు మానవత్వంతో తమ పిల్లలకు చేస్తున్న సాయానికి వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా కర్రీని ఆనందంగా అందిస్తున్నామని ఊర్మిళా దేవి తెలిపారు. దాతలు ముందుకు వస్తే సేవలను మరింత విస్తృతం చేస్తామని అధ్యాపకులు తమ అభిప్రాయాన్ని 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
ఇదీ చదవండి: భారత్ బంద్‌ను విజయవంతం చేయండి: ఏఐకేసీసీ