1 Lakh Scheme in Telangana for BC Communities : రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో జాప్యం.. ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వం అందించే కులవృత్తుల సాయం కోసం ఒక్కో మీసేవ కేంద్రానికి వందల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సర్వర్‌లు మొరాయిస్తున్నాయి. తుడి గడువు సమీపిస్తుండటంతో సర్టిఫికెట్లు అందక.. కొన్ని జారీ అయినా ముద్రణకు రాక.. జనం మీసేవ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
1 Lakh Scheme in Telangana for BC Caste List : రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులకు ప్రకటించిన రూ.లక్ష సాయం కోసం జనం అవస్థలు పడుతున్నారు. ఇందుకోసం కుల, ఆదాయ పత్రాలు తప్పనిసరి కావడంతో... మీ సేవా కేంద్రాలకు దరఖాస్తులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒక్కో కేంద్రానికి ఆయా ప్రాంతాలను బట్టి నిత్యం 50 వరకు దరఖాస్తులు వచ్చేవి. ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత.. ఈ సంఖ్య 200 నుంచి 400 వరకు ఎగబాకింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఉమ్మడి పాలమూరు జిల్లా.. ఇలా దాదాపు అన్ని మీసేవా కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో సర్వర్లు మోరాయిస్తున్నాయి. ఫలితంగా ధ్రువపత్రాల ముద్రణ కష్టంగా మారింది. వీటి కోసం ప్రజలు వారం రోజులుగా మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కుప్పలు తెప్పలుగా వస్తున్న దరఖాస్తులతో.. ఆర్థిక సాయం కోసం చూసే వారికే కాకుండా.. చదువు, ఉద్యోగాలు, ఇతర అవసరాలకు అప్లై చేసుకున్నవారికి సైతం సకాలంలో ధ్రువపత్రాలు రాక.. ముప్పుతిప్పలు తప్పడం లేదు.
'11వ తేదీన అప్లికేషన్ ఇస్తే.. రెండు రోజుల్లో రశీదు ఇచ్చారు. 5, 6 రోజుల్లో రమ్మన్నారు. ఇవాళ వచ్చినా.. బయట జనం గొడవతో లోపల మూసేశారు. ఇంకా రెండు రోజులే గడువు ఉంది. ఇప్పటికీ పత్రాలు చేతికందకపోతే.. 8 రోజులు, రూ.800 వృథా అయినట్టే'.- బాధితుడు
ఉపాధి వదిలిపెట్టి వచ్చి మీసేవా కేంద్రాల వద్ద పడరాని పాట్లు పడుతున్నా.. సమయానికి ధ్రువపత్రాలు అందేలా లేవని మహబూబాబాద్ జిల్లాలో వలసకూలీలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బతుకుదెరువు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన తాము ప్రభుత్వం ప్రకటించిన సాయం అందుకునేందుకు ఆశతో వచ్చామన్నారు. మీసేవా కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. అధికారులు సరిగ్గా స్పందించడం లేదంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు.
'నా కొడుకు కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది. అందుకోసం నేను అప్లై చెయ్యడానికి వచ్చాను. కానీ ఈ కులవృత్తుల సహాయం కోసం జనాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారు. నేను అప్లై చేసేదెప్పుడు.. ఆ సర్టిఫికెట్ వచ్చేది ఎప్పుడు..?'.-బాధితుడు
Delay In Issue Of Certificate : వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ధ్రువీకరించేందుకు రెవెన్యూ సిబ్బంది ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించాల్సి వస్తోంది. మీసేవా కేంద్రాల్లోనూ ఉదయం నుంచి వచ్చిన దరఖాస్తులను రాత్రి వరకూ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో గడువు ముగియనున్నందున రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
గడువు పెంచండి సారూ : కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో జాప్యం చేయొద్దని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినా.. సాంకేతికంగా సర్వర్ మోరాయిస్తుండటంతో ప్రక్రియ వేగంగా సాగని పరిస్థితి నెలకొంది. సర్వర్ మోరాయింపు, మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ, పత్రాల జారీలో కొనసాగుతున్న జాప్యం.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తు గడువు పొడిగించాలనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: