ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తీసుకెళ్లిన రైతులకు మహబూబ్నగర్లో నిర్వాహకులు సమస్యగా మారుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అధికారులు సూచించిన వారు మాత్రం అవి పట్టించుకోవట్లేదు. 14 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని.. మిగతా ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మిల్లర్ల కనుసైగలో పనిచేస్తూ వారు చెప్పినట్టు చేస్తూ.. అధికారుల ఆదేశాలను పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపించారు. వనపర్తి- మహబూబ్నగర్ ప్రధాన రహదారి చిన్నగుంటపల్లి రహదారిపై బైఠాయించారు. దీంతో మూడు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న జిల్లా సివిల్ సప్లై అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇకపై 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. ప్రతి బస్తాలో కేవలం 41 కేజీలు మాత్రమే తూకం చేసి రైతులకు చూపించాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.
ఇదీ చదవండి: సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ఆందోళన