మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వానాకాలం పంటల కొనుగోళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు 190 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రైతుల నుంచి పారదర్శకంగా పంటలను కొనుగోలు చేస్తూ... గిట్టుబాటు ధర కల్పిస్తామని పేర్కొన్నారు.
వానాకాలం పంటలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ విస్తరణ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని కలిగి ఉండాలని... ఏ రోజు ఏ గ్రామంలో ఎంత ధాన్యం కొంటున్నది రైతులు, రైస్ మిల్లర్లకు ముందే తెలిసేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో వరి పంట వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైనన్ని గోదాములు గుర్తించి సిద్ధంగా ఉంచాలని... అవసరమైతే ఫంక్షన్ హాల్లు, ఇతర ఖాళీ స్థలాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులు మొక్కజొన్న పండించవద్దని కోరినప్పటికీ మొక్కజొన్న పండించారని... రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, వివిధ శాఖల మధ్య సమన్వయం చేసుకునేందుకు వీలుగా 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 3 పత్తి కొనుగోలు, 5 మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నవంబర్ 7న జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన