ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకం కింద మండల మహిళా సమాఖ్యలకు మంజూరైన వ్యవసాయ పనిముట్లను అద్దెకిచ్చే కస్టమ్ హైరింగ్ సెంటర్లు... సత్ఫలితాలు ఇవ్వడం లేదు. 2020లో తొలివిడతగా 25లక్షలు విలువచేసే కస్టమ్ హైరింగ్ సెంటర్లను వందశాతం రాయితీతో.. నవాబుపేట, ధన్వాడ, తిమ్మాజీపేట, ఆత్మకూరు, మల్దకల్ మండల సమాఖ్యలకు మంజూరు చేశారు. ట్రాక్టర్, ట్రాలీ, రోటోవేటర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు సహా వివిధ రకాల పనిముట్లను సంఘాలకు అందించారు. వీటిని చిన్నసన్నకారు రైతులకు తక్కువ ధరకు అద్దెకివ్వడం ద్వారా సంఘాలు ఆదాయం పొందాల్సి ఉంటుంది. అన్ని కేంద్రాలు ప్రారంభమై ఏడాది గడుస్తున్నా.. ఖర్చులు పోను ఒక్కో కేంద్రానికి సగటున లక్షన్నర లాభం కూడా మిగల్లేదు. అదే జాతీయ గ్రామీణ జీవనోపాధుల పథకం కింద... 25శాతం రాయితీ, 75శాతం బ్యాంకుల నుంచి రుణాలిప్పించడం ద్వారా రెండోవిడత మంజూరు చేశారు. 20 నుంచి 25లక్షల రూపాయలతో వనపర్తి జిల్లాలోని కొత్తకోట, వీపనగండ్ల, ఖిల్లా ఘన్‌పూర్ మండల సమాఖ్యలకు.. కస్టమ్ హైరింగ్ సెంటర్లు అందించారు. పనిముట్లను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం లేకపోవడంతో... మండల సమాఖ్య లాభాల నుంచే చెల్లించాల్సి వస్తోందని ఆయా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయం, ఇసుక, సరుకు రవాణా సహా.. ఇతర అవసరాల కోసం ఊరూరా పదుల సంఖ్యలో ట్రాక్టర్లున్నాయి. దీంతో ట్రాక్టర్, ట్రాలీలకు గిరాకీ లేకుండా పోయింది. వినియోగం తెలియక వరినాటే యంత్రాలు, కలుపు తీసే యంత్రాలు మూలనపడ్డాయి. రైతుల్లో అవగాహన కరవై.... ఇతర పనిముట్లకు వచ్చే గిరాకీ అంతంత మాత్రమే. బహిరంగ మార్కెట్లో కంటే సీహెచ్సీలో పనిముట్ల అద్దెలు తక్కువగా దొరుకుతున్నా... ప్రచారం, డిమాండ్ లేక వాటి ద్వారా ఆదాయం రావడం లేదు. పనిముట్లు మరమ్మత్తులకు గురైతే.. వాటి ద్వారా వచ్చిన ఆదాయం ఆ ఖర్చులకే సరిపోతోందని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. క్రమం తప్పకుండా నెలసరి ఆదాయం వచ్చేలా... చర్యలు తీసుకోకపోతే కస్టమ్ హైరింగ్ సెంటర్ల నిర్వహణ పేరిట మండల మహిళా సమాఖ్యలు.... నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంది.
ఉన్న కస్టమ్ హైరింగ్ కేంద్రాల నిర్వహణే భారంగా మారుతున్న తరుణంలో.. జిల్లాకు 3 చొప్పున 15 మండలాల్లో కొత్తగా వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలను మంజూరు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వాటిని సంఘాలకు బలవంతంగా ఇప్పిస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చూడండి: