ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి విత్తన మాఫియా రెచ్చితోపోంది. పోలీసులు, వ్యవసాయశాఖ, టాస్క్ ఫోర్స్ బృందాలు చేపట్టిన దాడుల్లో నాణ్యత లేని, నిషేధిత పత్తి విత్తనాలు బయటపడుతున్నాయి. కల్తీ విత్తనాలు అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరిస్తున్నా మహబూబ్నగర్ జిల్లాలో రోజుకో చోట నిషేధిత విత్తనాలు బయటపడుతూనే ఉన్నాయి.
4,769 కిలోల నాణ్యత లేని విత్తనాలు
తాజాగా ధరూర్ మండలం గుడెందొడ్డి గ్రామంలో 8 క్వింటాళ్లు, మల్దకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏడు క్వింటాళ్ల అనుమతిలేని విత్తనాలను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆరు మండలాల్లో 14 గ్రామాల్లో జరిపిన దాడుల్లో నాలుగు వేల 769 కిలోల నాణ్యతలేని విత్తనాలు లభ్యమయ్యాయి. నిందితులపై 18 కేసులు నమోదు చేశారు.
నల్గొండలో విక్రయం
కొడంగల్ నియోజకవర్గంలోని దుగ్యాలగేటు వద్ద డీసీఎంలో తరలిస్తున్న నాలుగున్నర టన్నుల పత్తి విత్తనాలు పట్టుకున్నారు. అవి నాణ్యతలేని విత్తనాలగా వ్యవసాయ శాఖ అధికారులు తేల్చేశారు. నిందితులను విచారించగా.. నల్గొండ జిల్లాలో విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
పత్తి విత్తనం ఏ కారణం చేత తిరస్కరణకు గురైనా వాటిని వెంటనే నాశనం చేయాలి. విత్తన పత్తి పండించే రైతులు, ఆర్గనైజర్లు, కంపెనీలు ఎవరూ దీనిపై బాధ్యత తీసుకోవడం లేదు. అధికారయంత్రాంగం పత్తి విత్తన మాఫియాపై కఠినంగా వ్యవహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా రైతులు విత్తనాలు కొనేముందు కాస్త అప్రమత్తంగా ఉండాలి.
ఇదీ చూడండి : పబ్లో మహిళపై సహోద్యోగుల దాడి