వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం మండలిలో ప్రజల తరఫున బలమైన వాణి వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులతో ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో 39 శాతం ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని, కేంద్రం ఉద్యోగ ప్రకటనలపై నిషేధం విధించిందని ఆరోపించారు.
పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నా... అడిగే దిక్కులేదని.. అందుకే ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుక మండలిలో ఉండాలని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని గతంలో పాలమూరు వేదికగా జరిగిన సభలో సుష్మాస్వరాజ్ ప్రకటించారని గుర్తు చేశారు. ఆ వాగ్ధానాన్ని భాజపా అమలు చేయలేదన్నారు.
తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్, కాజీపేట రైల్వేకోచ్ లాంటివి రద్దు చేసి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటం కొనసాగించేందుకే తాను పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తన పదవీ కాలంలో ఏం చేశానన్న ప్రశ్నకు ఉద్యోగులు, నిరుద్యోగులు ,కాంట్రాక్టు ఉద్యోగులు సమాధానం చెబుతారన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం పనిచేయండి : కేటీఆర్