మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌లో రూర్బన్ నిధులతో ప్రారంభించిన చిరుధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రం అలంకార ప్రాయంగా మిగిలింది. ఇక్కడి అత్యాధునిక యంత్రాలకు రిపేర్ల వచ్చాయి. మహిళలకు శిక్షణ కరవై పనిలేకుండా పోయింది. సుమారు 33లక్షల ఖర్చుతో 2021 ఆగస్టులో చిరుధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రం ప్రారంభించారు. 27లక్షల వరకూ రూర్బన్ నిధులు కాగా.... ఐదున్నర లక్షలు మండల మహిళా సమాఖ్య నుంచి పెట్టుబడిగా పెట్టారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్, చిరుతిండ్ల తయారీ యంత్రాలను కొనుగోలు చేసి కేంద్రాన్ని నెలకొల్పారు.
మొదట్లో బాగానే నడిచినా..
మొదట్లో జొన్నరొట్టెల తయారీ, మురుకుల తయారీ యంత్రాలు బాగా నడిచాయి. చిరుతిండ్ల విక్రయం ద్వారా కొంత ఆదాయాన్ని పొందారు. ప్రస్తుతం మురుకులు మాత్రమే తయారవుతున్నాయి. బిస్కెట్లు తయారీ చేసే యంత్రం, రొట్టెలు తయారు చేసే యంత్రానికి పనిలేకుండా పోయింది. మైనర్ రిపేర్లతోపాటు వాటిని వినియోగించడంపై మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. జొన్నరొట్టెలు సన్నగా కాకుండా మందంగా వస్తుండటంతో ఉత్పత్తి నిలిపేసినట్లు తెలుస్తోంది.
సాంకేతిక ఇబ్బందులతో..
చిరుధాన్యాల ప్రాసెసింగ్‌కు సంబంధించి 3 రకాల యంత్రాలుండగా... అవి ప్రారంభం కాలేదు. సామలు, కొర్రలు వంటి ముడిసరుకు తీసుకువచ్చినా.... చిరుధాన్యాలపై పొరలు తొలగించే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సాంకేతిక పరమైన ఇబ్బందులు తొలగించడంతోపాటు ప్రాసెసింగ్ యంత్రాల వినియోగంపైనా మహిళలకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరో రెండు మూడు నెలల్లో కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గండీడ్ చిరుధాన్యాల ప్రాసెసింగ్ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని మహిళలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: