BJP Unemployment March In Mahabubnagar: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వ్యక్తి సీఎంగా ఎందుకు ఉండాలి.. అన్ని తప్పులకు తానే కారణమైతే.. మరి సీఎంగా కేసీఆర్ ఎందుకు ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మల్లికార్జున చౌరస్తా నుంచి ప్రారంభమైన మార్చ్.. గడియారం కూడలి వరకు సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు ఉందని బండి సంజయ్ విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయనే పోరాటం చేసి.. ఎందరో త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కావాలనే తప్పుల తడకగా నోటిఫికేషన్లు ఇచ్చారని.. ఆ తప్పులను తనపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్లేందుకు తాను భయపడనని.. ఇప్పటికే 9 సార్లు జైలుకు వెళ్లానని వివరించారు. ఇప్పటి వరకు ఏ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని జైలుకు పంపలేదని వెల్లడించారు.
కేటీఆర్ ఇద్దరే అంటే 50 మందిని ఎందుకు అరెస్ట్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది.. ఆ జీవోకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించారని బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. లక్షా 90 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమని మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. మరి పేపర్ లీకేజీకి ఇద్దరు మాత్రమే కారణమైతే.. 50 మందిని ఎందుకు అరెస్టు చేశారో తెలపాలని సీఎం కేసీఆర్‌కు ప్రశ్నల వర్షం కురిపించారు.
సిట్ వద్దు సిట్ జడ్జినే ముద్దు: మియాపూర్ భూములపై సిట్ నివేదిక ఏమైందని బండి ప్రశ్నించారు. నయీం ముఠా అరాచకాలపై వేసిన సిట్ నివేదిక ఏమైందని.. ఇప్పుడు పేపర్ లీకేజీ అంశంలో సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని బహిరంగంగా ప్రకటించారు. ఈ కేసును తప్పుదోవ పట్టడానికి ప్రయత్నించిన మంత్రి కేటీఆర్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సూచించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని.. ఇదే నిరుద్యోగ యువత మొత్తం కోరుకుంటుందని చెప్పారు. ఈ పేపర్ లీకేజీ నుంచి రాష్ట్ర ప్రజల చూపు మరల్చడం కోసమే.. పదో తరగతి పేపర్ లీకేజీ అంశం తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సందర్భంగా నష్టపోయిన యువతకు రూ. లక్ష పరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: