ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే యువత భవిష్యత్ కలలు సాకారం అవుతాయని.. అందుకు పట్టభద్రులైన యువకులు తప్పకుండా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జాతీయ యువజన అవార్డు గ్రహీతల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సామల వేణు పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
విద్యావంతులు స్వీయ భాధ్యతతో తమ ఓటును నమోదు చేసుకోవాలని వేణు కోరారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటరు నమోదు కోసం అన్ని జిల్లాల్లో అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సామాజిక అభివృద్ది సాధించానికి ఓటు హక్కు చాలా కీలకమైందని అన్నారు.
సామాజిక అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి, సమర్థవంతమైన ప్రతినిధులను చట్ట సభలకు పంపించే అవకాశం ఓటు ద్వారానే ఉంటుందని వేణు తెలిపారు. ప్రత్యేకంగా పట్టభద్రుల కోసమే ఏర్పాటు చేయబడిన ఈ శాసన మండలి ఎన్నికల పట్ల పూర్తిస్థాయి అవగాహన పెంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 31 వరకు బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా పట్టా పొందిన వారు కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.