ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 28 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 404కు చేరింది. అత్యధికంగా గద్వాల జిల్లాలో 8 కేసులు నమోదుకాగా.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో 6 కేసులు నమోదు కాగా.. నాగర్‌కర్నూల్‌లో 5, వనపర్తిలో 3 పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇందులో 9 నెలల పసికందుతోపాట ఓ ప్రజాప్రతినిధి ఉన్నారు.
మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన ముగ్గురికి కరోనా సోకింది. రాజేంద్రనగర్, ధనలక్ష్మికాలని, సంతోశ్‌నగర్‌కాలనీలో ఒక్కొక్కరు కొవిడ్ బారిన పడ్డారు. జడ్చర్ల మండలం ఉదండపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి, దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి, అదే మండలం ఇస్రంపల్లికి చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
నారాయణపేటలో..
నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒకే కుటుంబంలో 9 మందికి కొవిడ్-19 నిర్ధరణ కాగా.. అదే కుటుంబంలోంచి తాజాగా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. అప్పంపల్లికి చెందిన మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఇందులో ఒకరు మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. కోస్గి మండలం మిర్జాపూర్‌కు చెందిన 9 నెలల బాలుడికి కరోనా నిర్ధరణ అయింది.
నాగర్‌కర్నూల్‌లో..
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. నాగర్‌కర్నూల్ పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా... బిజినపల్లి, తిమ్మాజీపేటలో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అమ్రాబాద్ మండలం ఈగలపెంట గ్రామంలోఒకరికి, లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలోని మరో మహిళకు వైరస్ పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారి సుధాకర్ లాల్ తెలిపారు.
జోగులాంబ గద్వాలలో..
జోగులాంబ గద్వాల జిల్లాలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గద్వాల పట్టణంలోని బురదపేట, గంజిపేట, గాయత్రి ఎస్టేట్, రాజీవ్ కూడలి ప్రాంతాలలో ఒక్కో కేసు నమోదైంది. గట్టు మండలంలో ఒకరికి, ఇటిక్యాలలో ఒకరికి, రాజోలిలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
వనపర్తిలో..
వనపర్తి జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనపర్తి పట్టణంలోని సాయినగర్ కాలనీకి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా శనివారం తేలింది. కాగా.. ఆయన ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వనపర్తి జంగిడిపురం కాలనీకి చెందిన వ్యక్తికి, ఆత్మకూరు మండలం పిన్నంచర్లకు చెందిన మరో వ్యక్తికి కొవిడ్ బారిన పడ్డారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు