టీఎస్ ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్‌లో కార్గోకు మంచి ఆదాయం సమకూరుతోంది. సేవలు ప్రారంభించిన ఏడు నెలల్లో కోటి రూపాయల ఆదాయాన్ని ఆర్జించి ఘనత సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది జూన్ 19న కార్గో సేవలు రిజియన్ పరిధిలో అందుబాటులోకి వచ్చాయి. మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల్లో ఆరు కార్గో బస్సులతో సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే నిత్యం తిరిగే ప్రయాణికుల బస్సుల్లోనూ సరకు, కొరియర్లను పంపిస్తున్నారు.
రోజుకు 60 వేలకు పైగా...
56 మంది కార్గో కొరియర్ ఏజెంట్లతో పాటు నిత్యం 62 మంది ఈ సేవల్లో నిమగ్నమయ్యారు. 9 డిపోల పరిధిలో 21 కౌంటర్లు ఏర్పాటు చేశారు. రోజుకు 800 నుంచి 900 వరకు పార్సిళ్లు, కొరియర్‌లను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. రోజుకు రీజియన్‌కు 60 వేలకు పైగా ఆదాయం సమకూరుతోంది. అనతికాలంలోనే విస్తృతంగా పార్సిల్, కొరియర్ సేవలు అందిస్తూ కోటి రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది. అత్యధికంగా మహబూబ్‌నగర్ డిపో పరిధిలో 45 వేల పార్సిల్, కొరియర్లను చేరవేయగా... తద్వారా సుమారు 37 లక్షల ఆదాయం సమకూరింది. ఆ తర్వాత గద్వాల డిపో పరిధిలో 22 వేల పార్సిల్‌ల ద్వారా 18 లక్షల ఆదాయం సమకూరింది. ఇలా.. మహబూబ్‌నగర్ రిజియన్ పరిధిలోని 9 డిపోల ద్వారా లక్షా 36 వేల 540 పార్సిళ్లను చేరవేసి కోటి రూపాయల ఆదాయాన్ని సమకూర్చింది.
విశేష స్పందన...
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 21 కౌంటర్ల ద్వారా కార్గో సేవలు నిర్వహిస్తుండగా... రోజుకు సగటున 60 వేల వరకు ఆదాయం వస్తుంది. లక్ష రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుని సేవలను మరింత పెంచుకునేందుకు అదికారులు చర్యలు తీసుకుంటున్నారు. రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరో 9 మంది మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లను ఏర్పాటు చేసి కార్గో వ్యవస్థను నిర్వహిస్తున్నారు. సరకు రవాణాలో ఇబ్బందులు తలేత్తకుండా... సేవలపై అవగాహన కల్పిస్తూ కొరియర్ బుకింగ్‌లను పెంచేందుకు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సగటు వ్యక్తి మొదలు రాష్ట్ర రాజధానిలో ఉండే పారిశ్రామికవేత్త వరకు ఈ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ప్రైవేటు రేట్లతో పోలిస్తే ఆర్టీసీ పీసీసీ (పార్సల్, కార్గో, కొరియర్) సేవల ఛార్జీలు తక్కువగానే ఉన్నాయి. గంటల వ్యవధిలోనే ఇవి గమ్యస్థానాలకు చేరుతుండటం వల్ల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది.
రాబోయే రోజుల్లో డోర్ డెలివరీ...
రాబోయే రోజుల్లో డోర్ డెలివరీ సౌకర్యాన్ని కల్పించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు అవసరమైన వస్తు రవాణా ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా... వివిధ ప్రభుత్వ శాఖలు సైతం ఆర్టీసీ కార్గో బస్సులను వస్తు రవాణాకు వినియోగిస్తున్నారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించడం వల్ల వినియోగదారులకు మంచి వెసులుబాటు అయ్యిందని.. ధరలు కూడా ప్రైవేటుతో పోలిస్తే తక్కువ ధర ఉండటం... అవసరాలకు అనుగుణంగా గంటల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేరుతుండటం వల్ల రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. నిత్యం రద్దీ పెరుగుతున్న కారణంగా అందుకనుగుణంగా బుకింగ్ కేంద్రాలను, సిబ్బందిని ఏర్పాటు చేయ్యాలని.. సాంకేతికతను ఉపయోగిస్తూ... సేవలలో మరింత పారదర్శకత తీసుకురావాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఈ రంగంలో డోర్ డెలివరీకి అధిక ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో సంస్థ ఉద్యోగులను కూడా భాగస్వాములను చేయ్యాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాత్రమే పార్సిళ్లను డోర్ డెలివరీ ద్వారా అందిస్తుండగా.. జిల్లా కేంద్రాల్లోనూ ఈ సేవలను ప్రారంభించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు.