కరోనాతో వృద్ధుడు మృతి చెందగా...అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ సమయంలో స్వయంగా సర్పంచే అంత్యక్రియలు చేసి ఆదర్శంగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామంలో జరిగింది. పీపీఈ కిట్లను ధరించి మృతదేహాన్ని ట్రాక్టర్లో వేసి స్వయంగా తానే నడుపుతూ వెళ్లి అంత్యక్రియలు చేశారు.
వెంకటాపురంలోని సత్యనారాయణ అనే వ్యక్తి కరోనా పాజిటివ్ రాగా.. హోం క్వారంటైన్లో ఉన్నారు. ఐదు రోజుల అనంతరం ఆ వ్యక్తి మృతిచెందాడు. అతనికి అంత్యక్రియలు చేయడానికి అందరూ భయపడుతుండగా.. గ్రామ సర్పంచ్ లింగన్న.. అందరికీ ధైర్యం చెప్పి కుటుంబసభ్యులు, మున్సిపల్ సిబ్బందితో అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఎవరూ లేని అనాథలుగా చేయకూడదని.. ప్రతి ఒక్కరూ మానవత్వం చాటుకోవాలని సర్పంచ్ తెలిపారు.