ప్రజలు తమ వాహనాలను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలకు సూచించారు. మహబూబాబాద్‌లో పర్యటించిన ఆయన ఆర్టీసీ బస్ డిపో, బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బస్ డిపో ఆవరణలో మొక్కలు నాటారు. ఆర్టీసీకీ ప్రజల ఆదరణ పెరిగిందని తెలిపారు. మీ అందరీ సహకారంతో మరింత ముందుకు సాగాలని.. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ సిబ్బంది సేవలను సజ్జనార్ కొనియాడారు.
కొన్ని గ్రామాలకు బస్సులు నడవడం లేదని వినతులు వచ్చాయని సజ్జనార్ తెలిపారు. ఆ గ్రామాలను గుర్తించి బస్సులు నడిపిస్తామని.. ప్రజలు బస్సులోనే ప్రయాణించేలా చూడాలని కోరారు. డీజిల్, ఇతర సామగ్రి ధరలు పెరిగినందున ప్రజలు ఆర్టీసీలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ తరఫున నడిచే పెట్రోల్ స్టేషన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఉగాదికి మూడు ఆఫర్లు: తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజల కోసం మూడు ఆఫర్లను అందిస్తున్నామని సజ్జనార్ తెలిపారు. రేపు పండుగ రోజున 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు ఉచితంగా బస్సులో ప్రయాణించేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌కు 40 ఎలక్ట్రికల్ బస్సులు (పుష్పక్) బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్న వారు పది రోజుల లోపు మరోసారి టికెట్ బుక్ చేసుకుంటే 20 శాతం తగ్గింపు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఐదు కిలోల లోపు పార్సిల్స్ పంపే వారికి 25 శాతం రిబేటు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక , ఎస్పీ శరత్ చంద్ర, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో ప్రజల ఆదరణ బాగుంది. ఇక్కడ బస్ డిపోను తనిఖీ చేశా. యాజమాన్యం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారు. ప్రజలంతా మీ ప్రైవేట్ వాహనాలను పక్కనపెట్టి ఆర్టీసీలో ప్రయాణించాలి. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని చెప్పారు. త్వరలోనే సర్వీసులు నడుపుతాం. టీఎస్ఆర్టీసీ తరఫున పెట్రోల్ పంపు నడుపుతాం. ఉగాది రోజున 65 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాం. కార్గో సేవలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. - సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఎండీ
ఇదీ చూడండి: