Revanth Intersting Comments: తెలంగాణ సమాజానికి ప్రవేశంలేని ప్రగతిభవన్ గురించి తాను మాట్లాడితే కొందరు వివాదం చేస్తున్నారని... నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండాగా చెప్పిన కేసీఆర్‌పైనా కేసులు పెట్టారా... అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని నిషేధించిన గడి ఉంటే ఏంది... కూలితే ఏంటని అన్నారు. ములుగులో తాను మాట్లాడిన అంశాన్ని కొందరు వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హాథ్‌సే హాథ్ జోడో యాత్రలో భాగంగా.. మూడో రోజు రేవంత్‌రెడ్డి మహబూబాబాద్ జిల్లాలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. కేసముద్రం మండలం పెనుగొండ నుంచి ఉదయం యాత్ర ప్రారంభించిన ఆయన.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన వ్యాఖ్యలు దుమారంపై స్పందించిన రేవంత్.. పోలీసు కేసులు కొత్త కాదని భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల కోట్ల రూపాయల సొమ్ముతో ప్రగతిభవన్ నిర్మించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్‌కు ప్రజలను అనుమతించటంలేదని ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని నిషేధించిన గడీ ఉంటే ఏంది... కూలితే ఏంటని ప్రశ్నించారు. ఆనాడు సాయుధ పోరాటం చేసి నిజాం, రజాకార్ల గడీలను కూల్చారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో నిర్బంధాలతో కేసీఆర్ పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ గోడలను తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేసేదిలేదని.. రుణమాఫీ, ఉద్యోగాలు కల్పించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
అంతకు ముందు రేవంత్‌రెడ్డి మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులను సీఎం కేసీఆర్ విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణ వ్యతిరేకులు దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి లాంటి వారికి పదవులను కట్టబెట్టి ప్రగతి భవన్లో కూర్చోపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించాలంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ములుగులో నేను మాట్లాడిన అంశాన్ని కొందరు వివాదం చేస్తున్నారు. నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని గతంలో కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల కోట్ల రూపాయల సొమ్ముతో ప్రగతిభవన్ నిర్మించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రగతి భవన్‌కు ప్రజలను అనుమతించటంలేదు. తెలంగాణ సమాజాన్ని నిషేధించిన గడీ ఉంటే ఏంది... కూలితే ఏందీ. సాధించుకున్న తెలంగాణలో నిర్బంధాలతో కేసీఆర్ పాలన చేస్తున్నారు. ప్రగతి భవన్ గోడలను తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయం. ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనకడుగు వేసేదిలేదు.- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: రేవంత్‌రెడ్డిపై పోలీసులకు BRS నేతల ఫిర్యాదు.. యాత్రను అడ్డుకుంటామని వార్నింగ్
తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలిసిపోతోంది: రేవంత్ రెడ్డి
గ్రాండ్‌గా స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. రాజకోటలో ప్రత్యేక ఏర్పాట్లు.. ప్రముఖులు హాజరు