రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదనంగా 10 వేల కోట్ల రూపాయలను కేటాయించడంతో వైద్యారోగ్య రంగానికి మహర్దశ వస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు మారనున్నాయని మంత్రి వెల్లడించారు. మహబూబాబాద్‌కు మంజూరు చేసిన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలకు సంబంధించిన స్థలాన్ని, నూతన కలెక్టరేట్ నిర్మాణ పనులను ఎంపీ కవిత, జడ్పీ ఛైర్పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ వి.పి గౌతమ్‌లతో కలిసి పరిశీలించారు.
కొవిడ్ కారణంగా నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని, రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మహబూబాబాద్ నూతన జిల్లాగా ఏర్పాటు కావడంతో వరంగల్ వెళ్లడం తప్పిందన్నారు. మహబూబాబాద్ రూపురేఖలు మారిపోయాయని, మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రహదారులు-భవనాలు, సర్వే శాఖ అధికారులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KTR:'క్లిష్ట పరిస్థితుల్లోనూ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి'