Sathyavathi Rathod at temple: రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని వేడుకున్నానని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోరమీసాలు, భద్రకాళి అమ్మవారికి ముక్కుపుడకను మంత్రి సమర్పించారు. అనంతరం వీధుల్లో తిరుగుతూ తన మనవరాళ్లతో కలిసి సందడి చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన బెలూన్లు, పీకలు, ఆటల బొమ్మలు, తినుబండారాలను మంత్రి కొనుగోలు చేశారు.

తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని వీరభద్రస్వామిని కోరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవాలి. గతంలో ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేయడం జరిగింది. దాదాపు రూ.5 కోట్లతో ముఖ్యమంత్రి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. యాదాద్రితో సహా అనేక ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉంటాలని స్వామివారిని కోరుకున్నా. స్వామివారికి బంగారు కోరమీసాలు, అమ్మవారికి ముక్కు పుడక సమర్పించాం. రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిపోతారు. - సత్యవతి రాఠోడ్, రాష్ట్రమంత్రి

ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి

కాకతీయుల కాలం నాటి ఈ ఆలయాన్ని గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయ అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని తెలిపారు. ఆలయ పరిసరాల్లో హరిత హోటల్, కైలాస భవనం మంజూరు చేసి టూరిజం స్పాట్‌గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును కల్పించారు.
ఇదీ చూడండి: