మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం శివారులో రెండు బైక్లు డీకొని ఇద్దరు వ్యక్తులు 365 జాతీయ రహదారిపై పడిపోయారు. అటువైపుగా వచ్చిన మంత్రి సత్యవతి రాఠోడ్ గమనించి తన వాహనంలో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కొత్తగూడెం మండలం పోలారం గ్రామానికి చెందిన రామకృష్ణ మహబూబాబాద్ వైపు వస్తున్నాడు. పాల్వంచకు చెందిన లింగారెడ్డి నర్సంపేట వైపు వెళ్తున్నాడు. ముత్యాలమ్మ గూడెం శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరూ సృహ తప్పి పడిపోయారు.
ములుగు జిల్లాలో తన కార్యక్రమాలు ముగించుకుని మహబూబాబాద్ వైపు వస్తున్న మంత్రి.. రహదారిపై వారు పడి ఉండటం చూసి వెంటనే తన వాహనాన్ని ఆపి కిందికి దిగారు. క్షతగాత్రులను పరిశీలించి వారిలో ఒకరిని తన వాహనంలో, మరొకరిని పోలీస్ వాహనంలో ఎక్కించి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఇదీ చూడండి : విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల దుర్మరణం