వరంగల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి ప్రసంగించారు.
"వరంగల్ ప్రాముఖ్యతను తెలుసుకున్న కేంద్రం.. స్మార్ట్ సిటీగా ప్రకటించి కొన్ని నిధులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ ఒక్క కేంద్ర మంత్రి వరంగల్ నగరానికి రాలేదు. వరంగల్లో ఎన్నికలు వస్తున్నందున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి.. వరంగల్ అభివృద్ధిని తామే చేశామనడం సిగ్గుచేటు. భాజపా అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచింది. ఆ పార్టీ వల్ల మున్సిపాలిటీలకు, ప్రజలకు ఒరిగింది శూన్యం. తెలంగాణ చేదు అన్న విధంగా సవతి ప్రేమను చూపిస్తున్నారు. తెలంగాణ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఇప్పటి వరకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఊసేలేదు. గిరిజనులకు మేలు చేసే జీవో నెంబర్ 3ను కోర్ట్ కొట్టివేస్తే.. దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతితో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాం."
- సత్యవతి రాథోడ్, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు జరుగుతున్నాయి: కిషన్ రెడ్డి