మావోయిస్టు పార్టీ ఓ కీలకనేతను కోల్పోయింది. గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ (50) అలియాస్ హరిభూషణ్ అలియాస్ జగన్ సోమవారం మరణించినట్లు ఆ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో మూడు రోజుల సందిగ్థతకు తెరపడింది. మరో కీలక నాయకురాలు ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దిబోయిన సారక్క అలియాస్ భారతక్క కరోనా లక్షణాలతో మంగళవారం చనిపోయినట్లు పార్టీ పేర్కొంది.
1991లో అటవీ దళంలోకి
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం ఆదివాసీ దంపతులైన యాప కొమ్మక్క, రంగయ్యల మొదటి సంతానం హరిభూషణ్. రాడికల్ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యూ)లో పనిచేస్తూ 1991లో అటవీ దళంలో చేరారు. 1996లో ఖమ్మం జిల్లా కమిటీ సభ్యునిగా కొనసాగారు. 1998లో ఉత్తర తెలంగాణ మొదటి ప్లాటూన్ బాధ్యతలు తీసుకున్నారు. 2000లో ప్రొటెక్షన్ ప్లాటూన్‌కు బదిలీ అయి 2005లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా పదోన్నతి పొందారు. 2015 ప్లీనంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా, 2018 నవంబరులో కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారు. హరిభూషణ్ సేవలు పార్టీకి ముఖ్యమని భావించిన కేంద్ర కమిటీ ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేసింది. అక్కడ ఉద్యమకారులందరికీ యుద్ధ పోరాటాలు నేర్పించారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వాలు ఆపరేషన్ ప్రహార్, సమాధాన్, ఆపరేషన్ గ్రీన్‌హంట్ కార్యాచరణతో ముందుకు సాగిన క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ దండకారణ్యంలో ఆయన పట్టు సాధించారు. సరిహద్దు ఆదివాసీలు అతడిని లక్మాదాదాగా పిలుస్తారు.
ఎన్నో ఎదురుకాల్పుల్ల్లో తప్పించుకున్నా..
2013లో జరిగిన పువర్తి ఎన్‌కౌంటర్లో ఆయన మృతి చెందారని తొలుత ప్రచారం జరిగింది. 9 మంది మావోయిస్టులు మరణించిన ఈ ఘటనలో హరిభూషణ్ త్రుటిలో తప్పించుకున్నార[ు. పూజారికాకేడు తడపల గుట్టలపై జరిగిన ఎన్‌కౌంటర్లోనూ ఆయన పోలీసులకు చిక్కలేదు. 2016 బొట్టెంతోగు ఎదురుకాల్పుల నుంచీ బయటపడ్డారు. చివరకు అనారోగ్యం ఆయన ప్రాణాలను కాటేసింది. హరిభూషణ్ తలపై రూ.20 లక్షల రివార్డు ఉంది. ఆయన సుమారు 30కి పైగా ఎదురుకాల్పుల సంఘటనల నుంచి బయటపడ్డట్లు పోలీసువర్గాలు పేర్కొంటున్నాయి. గంగారానికి చెందిన జెజ్జరి సమ్మక్కను ఆయన ఉద్యమంలోనే వివాహం చేసుకున్నారు. ఈమె సైతం అస్వస్థతతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిరుడు కుమారుడు.. నేడు తల్లి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఆదివాసీ కుటుంబంలో భారతక్క జన్మించారు. 1985లో ఏటూరునాగారంలోని దళంలో చేరారు. 1986లో అరెస్టయి రెండేళ్లు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చి మళ్లీ దళంలోనే చేరారు. 1989లో తన సహచరుడు కోటి హన్మన్న మృతిచెందారు. అదే సమయంలో కుమారుడు అభిలాష్ జన్మించారు. 2002లో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన భారతక్క రెండోసారి అరెస్టయ్యారు. 2005లో జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి దళంలోకి వెళ్లారు. 2008లో దండకారణ్యానికి బదిలీ అయ్యారు. కుమారుడిని హన్మన్న చెల్లెలి వద్ద పరకాలలో ఉంచి పెంచారు. అతనూ దళంలో చేరి 2020లో గడ్చిరోలీలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందారు.
హరిభూషణ్ వారసుడిగా దామోదర్?
కరోనాతో కన్నుమూసిన మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ వారసుడిగా బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ మిలిటరీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారని పోలీసు వర్గాలంటున్నాయి. యాక్షన్ టీంలకూ ఇన్‌ఛార్జిగా ఉన్నారని సమాచారం. రాష్ట్ర కమిటీ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికితోడు ఉత్తర తెలంగాణ వ్యవహారాలపై గట్టి పట్టు ఉండటంతో పార్టీ నాయకత్వం అతడి వైపే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల అంచనా. రాష్ట్ర పార్టీలో కూడా దామోదర్ సీనియర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఏటూరు నాగారం-భూపాలపల్లి ఏరియా, కరీంనగర్-ఖమ్మం-వరంగల్ కార్యదర్శిగా వ్యవహరించారు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్‌కు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న రాష్ట్ర పార్టీకి మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే ఇప్పటివరకు హరిభూషణ్ కార్యదర్శిగా పనిచేయగా.. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్, అదే జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెంకు చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అలియాస్ బండి దాదా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పొచ్చెరకు చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ కమిటీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: KTR: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం