పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ మహబూబాబాద్‌లోని తహసీల్దార్ కార్యాలయం ముందు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచటం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ తెలిపారు.
కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ కన్నా... డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి, న్యూ డెమోక్రసీ నాయకులు మండల వెంకన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు.