Illegal Naala Occupation in Mahabubnagar : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని చెరువులకు నీటిని మోసుకువెళ్లే కాల్వలు, చెరువు నుంచి బయటకు నీటిని తరలించే అలుగుకాల్వలు, వరద కాల్వలు ఎక్కడికక్కడ కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాలతో కుంచించుకుపోతున్న నాలాలు పట్టణంలో వానాకాలంలో వరదలకు కారణమవుతున్నాయి. పిల్లలమర్రి నుంచి లక్ష్మీనగర్‌కాలనీ, శ్రీనివాసకాలనీ, పాలకొండ పెద్దచెరువు వరకు ఉన్న చిక్కుడువాగు.. రామయ్యబౌలి అలుగు నుంచి మేకలబండ, శివశక్తినగర్, పాతపాలమూరు, ఇమాంసాబ్‌కుంట వరకు ఉన్న పెద్దచెరువువాగు పొడవునా తాజాగా ఆక్రమణలు వెలిశాయి.
కబ్జా చేసిన స్థలంలో ఇళ్ల నిర్మాణాలు: పాతపాలమూరు సమీపంలో ఇటీవల కొందరు ఏకంగా కాల్వలోన భవననిర్మాణం చేపట్టారు. బఫర్ జోన్‌లో కొత్తగా ఇంటి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. లక్ష్మినగర్ కాలనీలో చిక్కుడువాగుపై కొందరు పునాది నిర్మించి వదిలేశారు. పెద్దచెరువు రెండో అలుగు నుంచి తవ్విన కాల్వకు.. ఆనుకుని కొత్త నిర్మాణాలు మొదలయ్యాయి. ఇలా నాలాల పొడవునా బఫర్ జోన్లలో 13 వరకు ప్లాట్లు వెలిశాయి. వీటిలో ఇప్పటికే కొందరు ఇళ్లు, మరికొందరు ప్రహరీలు నిర్మించుకున్నారు. అక్కడితో ఆగకుండా మట్టి, భవనశిథిలాలతో నాలాను క్రమంగా పూడ్చుతూవస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక అధికారులు నీటిపారుదల అధికారులు, టాస్క్‌ఫోర్స్ అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి కూడా చూడటం లేదు.
చర్యలు తగ్గే ఆక్రమాలు పెరిగే: తాజా ఆక్రమణలపై చర్యలు లేకపోగా, గతంలో గుర్తించిన ఆక్రమణలపైనా చర్యలు కరవయ్యాయి. పెద్దచెరువు నిండినప్పుడల్లా రామయ్యబౌలీ అలుగు నుంచి వరదనీరు బయటకు పారి రామయ్య బౌలీ, మేకలబండ, శివశక్తి నగర్ ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ ముంపు నుంచి తప్పించేందుకు రామయ్యబౌలి అలుగు నుంచి వరద కాల్వలు నిర్మించేందుకు ప్రణాళికలు వేసినా.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి.
అసంపూర్తి పనులు: రామయ్య బౌలీ అలుగు సమీపంలో ఇళ్ల మధ్య 800 మీటర్ల మేర కొత్తగా వరద కాల్వను నిర్మించి వదిలేశారు. మిగిలిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ కాల్వ పరిధిలో ఆక్రమణలు గుర్తించినా ఇప్పటికీ వాటిని తొలగించలేదు. బీకే రెడ్డి కాలనీ నుంచి ఇమాస్సాబ్ కుంట వరకూ... పట్టణ మురుగు, అలుగు నీళ్లను మోసుకెళ్లాల్సిన వరద కాల్వ పనులు సైతం అసంపూర్తిగానే మిగిలాయి. ఈ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తే తప్ప పట్ణణాన్ని వానాకాలంలో ముంపు నుంచి తప్పించే అవకాశం లేదు. మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్‌లు మాత్రం పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నారు.
ఏళ్లుగా నాలాలపై కబ్జాలను అధికారులు నిలువరించకపోవడంతో వందలాది ఇళ్లు వెలిసి విశాలమైన నాలాలు చిన్న మురుగు కాల్వల కింద మారిపోయాయి. పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఉన్న నాలాలైనా కాపాడుకోకపోతే పాలమూరు పట్టణానికి వరద ముంపు తప్పేలా లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాలపై ప్రత్యేకదృష్టి సారించాలని జనం కోరుతున్నారు.
ఇవీ చదవండి: