Etela Fire On CM KCR: తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యల పరంపర ఎలా కొనసాగిందో.. నేడూ అలాగే కొనసాగుతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ముత్యాల సాగర్ కుటుంబ సభ్యులను ఈటల పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని సాగర్ నివాసానికి వెళ్లిన ఈటల.. పార్టీ తరఫున 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈటల మండిపడ్డారు. ఏళ్ల తరబడి అప్పులు చేస్తూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ.. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న ఈటల.. వాటిని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రభుత్వానికి అది అలవాటైంది..
'బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటాలు చేశామని.. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని మంత్రి కేటీఆర్ మాటిచ్చారు. ఇప్పటికీ దాని ఊసే లేదు. ప్రతి విషయంలో కేంద్రంతో మెలిక పెట్టి తప్పించుకుంటున్నారు. మంచి జరిగితే కేసీఆర్ ఖాతాలో.. కొద్దిగా అటూ ఇటూ జరిగితే కేంద్రంపై నెట్టేయడం ప్రభుత్వానికి అలవాటైంది. ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి 50 లక్షల పరిహారం చెల్లించాలి. వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలి.' - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే
నిరాశా నిస్పృహలతో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈటల సూచించారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని కోరారు. అనంతరం నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎర్రచెక్రుతండాలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోధ్యా కుటుంబాన్ని ఈటల రాజేందర్ పరామర్శించారు. బోధ్యా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు. ఈటలతో పాటు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్, జిల్లా భాజపా అధ్యక్షుడు రాంచందర్ రావు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈటల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: