అల్పపీడన ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు మండలాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఈదురుగాలుల వల్ల పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. బయ్యారం, డోర్నకల్, నర్సింహులుపేట, కురవి మండలాల్లో జనజీవనం స్తంభించిపోయింది.
జిల్లావ్యాప్తంగా 4,72 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, బయ్యారంలో అత్యధికంగా 10.2 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. పెద్డవంగర, మరిపెడ, చిన్నగూడూరు, నెల్లికుదురు మండలాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని శ్రీరామగిరిలో ఒకటి, మునిగలవీడులో రెండు, మాదాపురంలో రెండు ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
రైతన్నకు శాపం
రహదారులపై ఆరబోసిన మొక్కజొన్న పంట వర్షం తాకిడికి నీటిలో కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా పత్తి, మిరప, వరి పంటలు దెబ్బతింటాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాకపోకలు బంద్
గార్ల శివారులో పాకాల వాగు చెక్‌డ్యాంపై నుంచి పొంగి ప్రవహిస్తుండడంతో రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో మేఘాలు కమ్మేయడంతో వాహనదారులు పగలే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. మహబూబాబాద్‌లో పలు కాలనీల్లో వరదనీరు చేరి, రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.