మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. కలెక్టర్ వి.పి గౌతమ్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్‌లతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవీ జీవిత చరిత్రపై పట్టణానికి చెందిన కవి గుర్రపు సత్యనారాయణ రచించిన స్థిత ప్రజ్ఞుడు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక ప్రగతికి సరికొత్త జీవం పోసిన ఆర్థికవేత్త పీవీ నరసింహారావు అని ప్రశంసించారు. బహుభాషావేత్త, అపర మేధావి, తెలంగాణ ముద్దుబిడ్డ అని ఆయనను కొనియాడారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని మంత్రి సత్యవతి రాఠోడ్ వెల్లడించారు.