మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల శివారు పెద్దతండాకు చెందిన 12 మంది రైతులు పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నర్సింహులపేట మండలం పెద్దనాగారం స్టేజీ శివారు జగ్యాతండా సమీపంలోని పలు సర్వే నంబర్లలోని 12 ఎకరాల భూమి తమ తాతలైన లునావత్ కృష్ణ, బిచ్చా పేరున ఉందన్నారు. కుటుంబ పోషణ కోసం గత కొన్నేళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వలస వెళ్లినట్లు తెలిపారు.
ఇదే అదునుగా భావించి పెద్దనాగారానికి చెందిన ముగ్గురు రైతులు తమ భూమిని సాగు చేసుకోవటంతోపాటు తహసీల్దార్, వీఆర్వోలతో కుమ్మక్కై.. భూమి కేసు కోర్టులో ఉన్నప్పటికీ 6 ఎకరాలు పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. మరో ఆరెకరాల భూమిని పట్టా చేసేందుకు సిద్ధం చేసుకున్నట్లు వాపోయారు. సమస్యను పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పడం లేదన్నారు. చేసేది లేక పెట్రోల్ సీసాతో ఆందోళనకు దిగినట్లు చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై నరేశ్ వారి వద్దకు చేరుకుని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.
గత 50 సంవత్సరాల క్రితం భూమిని అమ్ముకున్నారని తహసీల్దార్ పున్నంచందర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలనటంతో విచారణ చేపట్టి అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. కావాలని ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు