కాజీపేట్కు రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్కు తరలించి తెలంగాణకు అన్యాయం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి రాష్ట్రంలో నలుగురు భాజపా ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీని తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేంద్రం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందని విమర్శించారు.
వంద రోజుల్లో నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచుతామని, రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి, సొంత స్థలంలో రెండు పడక గదుల నిర్మాణం, 57 సంవత్సరాల వారికి పింఛన్లు, రైతుల రుణమాఫీని ఏడాది కాలంలో పూర్తిచేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఓటర్లు అంతా పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని కోరారు.
ఇదీ చదవండి:శబ్నమ్ 'ఉరి'కి తాడు తయారు చేయాలని ఆదేశాలు